ఈ నేత చేరితే జగన్ యాత్రకు ఊపు వస్తుందా?

వైఎస్ జగన్ పాదయాత్రకు అంతా సిద్ధమవుతోంది. ఈనెల 6వ తేదీ నుంచి ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రలో సంచలనం సృష్టించాలని వైసీపీ భావిస్తోంది. ప్రారంభమయ్యే రెండు రోజుల్లోనే టీడీపీకి ఝలక్ ఇవ్వాలని నిర్ణయించారు. అధికార తెలుగుదేశంపార్టీలోకి వెళతారని భావిస్తున్న నేతలను పాదయాత్రలో భాగంగా వైసీపీలోకి చేర్చుకోవాలని వ్యూహాన్ని రచిస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలో ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే జగన్ పాదయాత్ర జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల నుంచి కొనసాగతుంది. అయితే మైదుకూరు చేరుకున్న తర్వాత మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని అక్కడే పార్టీలో చేర్చుకుని పాదయాత్రకు ఊపు తేవాలని జగన్ భావిస్తున్నారు.
మైదుకూరు చేరేందుకు.....
డీఎల్ రవీంద్రారెడ్డి ఆరుసార్లు మైదుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రఘుమారెడ్డి మైదుకూరు నుంచి విజయం సాధించారు. తొలుత డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలోకి వెళతారన్న వార్తలు వచ్చాయి. అయితే టీడీపీ అక్కడి ఇన్ ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ డీఎల్ చేరికకు ససేమిరా అంటున్నారు. పుట్టాకు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ అండగా నిలిచారు. పుట్టా నియోజకవర్గ ఇన్ ఛార్జి నుంచి తప్పుకోనని చెప్పడం, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసి తీరుతానని స్పష్టం చేయడంతో ఆయనకు ఇవ్వాలనుకున్న టీటీడీ ఛైర్మన్ పదవిని చంద్రబాబు కోల్డ్ స్టోరేజీలో పెట్టేశారు. దీంతో డీఎల్ చేరిక ఇక లేదని తేలిపోవడంతో జగన్ తల్లి విజయమ్మ ఇటీవల డీఎల్ ను కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. జగన్ కూడా డీఎల్ తో ఫోన్లో మాట్లాడినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్ర మైదుకూరు చేరుకోగానే డీఎల్ రవీంద్రారెడ్డి పార్టీ తీర్థం పుచ్చుకుంటారని వైసీపీలో జోరుగాచర్చ జరుగుతోంది. డీఎల్ కూడా వైసీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. డీఎల్ పాదయాత్ర లో చేరితే కేవలం ఆ నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మంచి సంకేతాలు వెళతాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు వైసీపీ నేతలు జరుపుతున్న మంతనాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సిందే.

