ఈ నేతకు ‘నో ఎంట్రీ’ అని జగన్ చెప్పారా?

మాజీ తెలుగుదేశం పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని జగన్ దూరం చేసుకున్నారా? ఆయన పార్టీలో చేరతానన్నా అందుకు జగన్ అంగీకరించలేదా? అవుననే అంటున్నారు కర్నూలు జిల్లా వైసీపీ నేతలు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లాలో కొద్దోగొప్పో పట్టున్న నేత. ఆయన 2013లో తెలుగుదేశం పార్టీని వీడి సొంతంగా రాయలసీమ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసుకున్నారు. సీమ జిల్లాల్లో యాత్ర కూడా చేశారు. బైరెడ్డి యాత్రకు సీమ జిల్లాల నుంచి మంచి స్పందనే లభించింది.
తొలుత వైసీపీ చేరాలని...
అయితే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తొలుత వైసీపీలో చేరదామనుకున్నారు. ఈ మేరకు వైసీపీ నేతలకు సంకేతాలు కూడా పంపారు. కాని పార్టీ అధినేత జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందలేదు. అందుకు కారణం. బైరెడ్డి రాకతో కర్నూలు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో నేతలు ఇబ్బంది పడతారన్నది జగన్ ఆలోచన. అంతేకాదు తాను టిక్కెట్ ఇచ్చిన తర్వాత గెలిచి టీడీపీలోకి బైరెడ్డి వెళ్లడన్న గ్యారంటీ కూడా లేదు. కర్నూలు జిల్లా నేతలు కూడా కొందరు బైరెడ్డి రాకను వ్యతిరేకించారు. ముఖ్యంగా నందికొట్కూరు నియోజకవర్గం నేతలు అస్సలు ఒప్పుకోకపోవడంతో బైరెడ్డిని పార్టీలోకి చేర్చుకునేందుకు జగన్ ఇష్టపడలేదు.
సంక్రాంతి తర్వాత టీడీపీలోకి...
దీంతో బైరెడ్డి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు పావులు కదిపారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనే వైసీపీలో చేరాలని ప్రయత్నించినా అధి సాధ్యం కాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిని బరిలోకి దింపారు బైరెడ్డి. అయితే తాజాగా వచ్చిన కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలు బైరెడ్డి టీడీపీలో చేరడానికి మార్గం సుగమమం చేశాయి. చంద్రబాబును కలిసిన తర్వాత ఆయన పార్టీలో చేరడానికి అంతా రెడీ చేసుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత ముహూర్తాన్ని కూడా నిర్ణయించేశారు. ఇప్పటి వరకూ బైరెడ్డి రాకను అడ్డుకుంటున్న కేఈ బ్రదర్స్ కూడా అంగీకరించడంతో సంక్రాంతి తర్వాత టీడీపీలో చేరేందుకు సన్నాహాలు ప్రారంభించారు. మొత్తం మీద బైరెడ్డి కుదిరితే వైసీపీలో చేరేవారు. అక్కడ నో ఎంట్రీ అనిచెప్పడంతోనే టీడీపీలో చేరుతున్నారు.
- Tags
- జగన్

