ఈ టీడీపీ ఎమ్మెల్యే దేవుడికే....శఠగోపం పెట్టేశారా?

రాష్ట్రంలో అవినీతికి తావులేదు. టీడీపీలో నేతలు నిజాయితీగా ఉంటారు. ఉండాలి కూడా! పదే పదే సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలను టీడీపీ తమ్ముళ్లు లైట్ గా తీసుకుంటున్నారా? ఈ చెవితో ఆ మాటలు విని.. ఆ చెవితో గాలికి వదిలేదస్తున్నారా? అంటే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఔననే అంటోంది. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల దందాలు రోజుకొకటిగా బయటపడుతున్నాయి. ఇసుక మాఫియా, భూ మాఫియా, కాల్ మనీ ఇలా ఇందుగలడందు లేడను.. సందేహం లేదు.. అన్నట్టుగా టీడీపీ ఎమ్మెల్యేలు వేళ్లు పెట్టని రంగం లేదు. దీంతో పార్టీ పరువు బజారున పడుతోంది. విజయవాడలో ఎమ్మెల్యే బోండా ఉమా .. 60 కోట్ల విలువైన భూమి బొక్కేశారని వచ్చిన వార్తలు మరవక ముందే.. రూ.50 కోట్లకు మరో టీడీపీ ఎమ్మెల్యే ఎసరు పెట్టేశాడు.
యాభై కోట్ల మేరకు అవినీతి జరిగిందని.....
విషయంలోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో రూ. 50 కోట్లకు అవినీతి జరిగింది. అయితే, దీనిపై విచారణ లేకుండా చేయడానికి ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తన వంతు ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. గతంలో ఇక్కడ అవినీతి జరుగుతోందన్న ప్రచారం చేయించిన వర్మ.. తన అనుచరులను ట్రస్టు సభ్యులుగా వేయించి సంస్థానంలో తన హవా కొనసాగిస్తున్నారు. ట్రస్టు సభ్యులైన తన అనుచరుల ద్వారా రూ. 50 కోట్ల ఆస్తులను పక్కదారి పట్టించి.. ఇటీవల తనకు వాటాలు రాకపోవడంతో పాటు అవినీతి బయటపడుతుందన్న భయంతో దేవాదాయ శాఖలో విలీనం చేసేలా సరికొత్త ఎత్తుగడ వేస్తున్నారన్న వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ముగ్గురు నేతల సస్పెన్షన్.....
ఇక, రూ.50 కోట్ల మేర అవినీతికి పాల్పడింది టీడీపీ నేతలే అయినా ముగ్గురిని మాత్రమే పార్టీ నుంచి సస్పెండ్ చేయించి, తమకు ఏపాపం తెలియదన్నట్టుగా ఎమ్మెల్యే వ్యవహరించడం స్థానికంగా ఇప్పుడు కలకలం రేపుతోంది. తన అవినీతి కార్యక్రమాలకు అధికారులను బలి చేయడం ఎమ్మెల్యేకు ఎంత వరకు సమంజసమని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సంస్థానం ఏఈఓను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం సాగుతుండడం మరింత దారుణం. గతంలో రూ.9 కోట్లు అడ్డంగా దోచేశారని స్వయంగా చెప్పిన వర్మ ఆ అవినీతి పరులపై విచారణ లేకుండా విచారణను పక్కదోవ పట్టించారన్న టాక్ కూడా ఉంది. అంతేకాదు, కావాలనే విచారణను వాయిదాలు వేస్తూ అవినీతి పరులు సర్దుకోడానికి తనవంతు సహకారం చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
చంద్రబాబుకు ఫిర్యాదు.....
ఇక, ఇప్పుడు రూ.50 కోట్ల మేర ఆస్తులను ఆయన పక్కాగా బొక్కేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఎలాంటి విచారణా లేకపోతే.. భవిష్యత్తులో సంస్థానం ఆస్తులకు రక్షణ మాటేమిటని అంటున్నారు స్థానికులు. ప్రస్తుతం ఈ విషయం నివురు గప్పిన నిప్పులా ఉండడం గమనార్హం. త్వరలోనే దీనిపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు స్థానికులు సిద్ధమవుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి
- Tags
- టీడీపీ

