ఈ ఎమ్మెల్యేలతో కేసీఆర్ పరేషాన్....!

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు అనవసరవ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ప్రజల్లో చులకన అయిపోతున్నారు. పార్టీ పరువును కూడా బజారున పడేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. గతంలో వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు విద్యుత్తు కాంట్రాక్టు కార్మికుడిని దుర్భాషలాడారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసభ్యపదజాలంతో దూషించడంతో ఆ విద్యుత్తు కాంట్రాక్టు కార్మికుడు పోలీసు కేసు నమోదుచేశాడు. అయితే ఆ కేసు ఇప్పుడు నీరుగారిపోయింది. ఇక తాజాగా నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం డీసీసీఐ అధికారిని ఫోన్లో బెదిరించిన ఆడియో కూడా సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఇది పార్టీకి నష్టం కల్గించే అంశంగా టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు. దీనిపై వీరేశాన్ని వివరణ కోరినట్లు తెలిసింది. ఎమ్మెల్యే వీరేశం మాత్రం ఒక వికలాంగురాలి కోసం తాను అధికారిపై వత్తిడి తెచ్చానంటున్నారు.
వరుస వివాదాల్లో చిక్కుకుంటూ....
అలాగే మరోవైపు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి వ్యవహారం కూడా పార్టీకి ఇబ్బంది తెచ్చిపెట్టింది. స్వయంగా కలెక్టర్ ముత్తిరెడ్డి ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని ప్రకటన చేయడం సంచలనం కల్గించింది. దీనిపై ముత్తిరెడ్డి సభా హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. అదే జిల్లాలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించడం కూడా వివాదాస్పదమయింది. వెంటనే శంకర్ నాయక్ చేత క్షమాపణ చెప్పించి ఆ వివాదాన్ని సద్డుమణిగేలా చేయగలిగారు పార్టీ అగ్రనేతలు. అంతేకాకుండా స్పీకర్ మధుసూధనాచారి పదవి కోసం తనవద్ద డబ్బులు తీసుకున్నారని ఇటీవల మార్కెట్ యార్డు ఛైర్మన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకోవడం పార్టీకి నష్టం చేకూరుస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. విపక్షాల ఆరోపణలు ఎలా ఉన్నా.. సొంత పార్టీ నేతల స్వయం కృతాపరాధం కారణంగా పార్టీని ప్రజల్లో నవ్వుల పాలు చేస్తుందని కేసీఆర్ సీరియస్ అయినట్లు సమాచారం. వివాదాస్పదమైన ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వాలా? లేదా? అన్నది కూడా వారి పనితీరును బట్టే నిర్ణయిస్తానని గతంలో కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరి వీరికి టిక్కెట్లు దక్కుతాయో లేదో అన్నది పక్కన పెడితే పార్టీ పరువు మాత్రం వీరి వ్యవహారంతో రోడ్డున పడిందని ముఖ్యమంత్రి ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది.
- Tags
- కేసీఆర్

