ఈసారి సీనియర్లకూ టిక్కెట్లు దక్కవా?

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో సర్వేలనే నమ్ముకోనుంది. వచ్చే నెల నుంచి కాంగ్రెస్ పార్టీ సర్వేలను ప్రారంభిస్తోంది. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సర్వేను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గంలో బలమైన అభ్యర్థితో పాటుగా, సామాజిక సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన రేవంత్ భారీగా తన సన్నిహితులతో కాంగ్రెస్ పార్టీలోకి తరలి రావడంతో ఆ పార్టీలో మరింత జోష్ పెరిగింది. రాహుల్ ప్రత్యేకంగా సమావేశమైన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వేల కోసం రాహుల్ అనుమతి తీసుకున్నారు. వచ్చే నెల నుంచి సర్వేలు మొదలు పెట్టనున్నారు. సర్వేలను కూడా ప్రతిష్టాత్మకమైన సంస్థకు అప్పగించనున్నారు.
సర్వేల ఆధారంగానే టిక్కెట్లు.....
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడనుంది. ఇప్పటి వరకూ కొంత స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ లో రేవంత్ రాకతో కొత్త జోష్ నెలకొంది. ఈ నేపథ్యంలో్ నవంబరు 19వ తేదీన రాహుల్ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఆరోజు వరంగల్ లో సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో అందరికీ టిక్కెట్లు ఇవ్వలేమని, సర్వేల్లో గెలుపు అవకాశం ఉన్న వారికే టిక్కెట్లు దక్కుతాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. దీంతో పాటు డిసెంబరు 9వ తేదీ నుంచి పాదయాత్ర చేసేందుకు రాహుల్ అనుమతిని రేవంత్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ లో మరింత ఉత్సాహం పెరుగుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద సీనియర్లు...పైరవీలకు తావు లేకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ సర్వేల ఆధారంగానే టిక్కెట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ ఈసారి తెలంగాణ లో జెండా పాతడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది.
- Tags
- కాంగ్రెస్

