ఈసారి చంద్రబాబుకు కేసీఆర్ ఆహ్వానం...!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో మెగా ఈవెంట్ కి ప్లాన్ చేస్తున్నారు. అదే ప్రపంచ తెలుగు మహాసభలు. ఈ మహాసభలకు భాగ్యనగరం ఆతిధ్యం ఇవ్వబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా వున్న సుప్రసిద్ధ కవులు, రచయితలు, కళాకారులతో చారిత్రక సభలు నిర్వహించాలని తలపెట్టారు కేసీఆర్. గతంలో ఎన్నడూ జరగని విధంగా ధూమ్ ధామ్ గా ఈ సభలు జరపాలని గులాబీ బాస్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మెట్రో రైలు ప్రారంభం, ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుల విజయవంతం గా ముగియడంతో నెక్స్ట్ ఏంటి అని ప్రపంచ తెలుగు మహా సభల నిర్వహణకు సంబంధించి కార్యాచరణ మొదలెట్టేశారు ఆయన.
ఏపీ సీఎం ను ఆహ్వానించనున్న కేసీఆర్ ....
ఈ కార్యక్రమానికి ఈసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కేసీఆర్ ఆహ్వానించనున్నారు. ఆయనతో పాటు తెలుగు భాష మాట్లాడే వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖులను ఆహ్వానిస్తారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సైతం మహాసభలకు విచ్చేస్తారని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. మెట్రో ప్రారంభానికి, ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు ఏపీ సీఎం కు ఆహ్వానం లేకపోవడం పట్ల చంద్రబాబు కొంత నొచ్చుకున్నారు. ఆలోటును ప్రపంచ తెలుగు మహాసభల్లో తీర్చేయనున్నారు కేసీఆర్.

