ఈరోజు తేలిపోతుందా?

బీజేపీ, టీడీపీ చర్చలు ఫలిస్తాయా? లేక పార్లమెంటులో యధావిధిగా ఆందోళనకు తెలుగుదేశం పార్టీ దిగుతుందా? ఈరోజు తేలిపోనుంది. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే చంద్రబాబు తన పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులకు దిశానిర్దేశం చేశారు. పోరాట పంథాను వదలుకోవద్దని ఆయన సూచించారు. కేంద్రం దిగి వచ్చేంత వరకూ పోరాడాల్సిందేనని, పార్లమెంటులో సభా కార్యక్రమాలను స్థంభింప చేసే విధంగా ఆందోళన కొనసాగాలని చంద్రబాబు పార్టీ ఎంపీలకు ఆదేశించారు.
అన్ని పార్టీలనూ కలిసి.....
పార్లమెంటు బయట, లోపల ఆందోళనలు చేస్తూనూ జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతును కూడా కూడగట్టేందుకు ప్రయత్నించాలని ఎంపీలకు ఉద్భోదించారు. ఈ బాధ్యతను కొందరు ఎంపీలకు అప్పగించారు. ఇప్పటికే ఏపీకి విభజన చట్టప్రకారం రావాల్సిన నిధులు, ఇచ్చిన హామీల అమలుపై సవివరంగా ఒక నివేదికను తయారు చేశారు. ఈ నివేదికను జతచేసి, తమకు మద్దతివ్వాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు లేఖలను అందించనుంది.
నేడు రెండు పార్టీల చర్చలు....
మరోవైపు ఈరోజు కేంద్రంతో టీడీపీ నేతలు చర్చలు జరపనున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగిన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు. 5వ తేదీన చర్చలకు రావాలని ఆహ్వానించారు. ఈమేరకు చంద్రబాబు పార్టీ తరుపున కేంద్రమంత్రి సుజనాచౌదరి, రామ్మోహన్ నాయుడు, కుటుంబరావులు చర్చలకు వస్తారని తెలిపారు. ఈరోజు జరిగే చర్చల్లో బీజేపీ నుంచి కొంత సానుకూల ప్రకటన వెలువడే అవకాశముందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
సానుకూల ప్రకటన వస్తుందని....
ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ఫ్యాక్టరీ, రెవెన్యూ లోటు తదితర అంశాలపై ఒక క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫార్ములాను ఇప్పటికే ఏపీ అధికారులకు పంపామని, వారి నుంచి ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. అయితే ఏపీ అధికారులు మాత్రం తమకు ఎలాంటి ఫార్ములా ఆర్థిక శాఖ నుంచి అందలేదని చెబుతున్నారు. అయితే ఈరోజు జరిగే చర్చల్లో ఈ ఫార్ములా కూడా బయటకు వస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. చర్చలు ఫలప్రదంగా ముగిస్తే తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో ఏ స్టాండ్ తీసుకుంటుందో చూడాలి.

