ఈయన రాకకోసం నిలువెల్ల కనులై....!

తెలంగాణ బీజేపీ ఈయనపై పూర్తి ఆశలు పెట్టుకుంది. ఆయన వస్తేగాని తమ పరిస్థితి మెరుగుపడదని భావిస్తోంది. ఆయన లక్కీ హ్యాండ్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో తమకూ ఆ నేతను పంపమని అధిష్టానాన్ని అభ్యర్థిస్తోంది. ఆయనే రామ్ మాధవ్. బీజేపీలో లక్కీ హ్యాండ్ గా రామ్ మాధవ్ కు పేరుంది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన రామ్ మాధవ్ ది తూర్పు గోదావరి జిల్లా. ఆయన ఆర్ఎస్ఎస్ లో అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పడు మోడీ, అమిత్ షా కోటరీలో ముఖ్యుడు. దేశంలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా రామ్ మాధవ్ ను అక్కడకు పంపాల్సిందే. ఆయన మీద అమిత్ కు అంత నమ్మకం. విశ్వాసం. అప్పజెప్పిన పనిని అకుంఠిత దీక్షతో దిగ్విజయంగా చేసుకువచ్చే రామ్ మాధవ్ పేరును ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు కలవరిస్తున్నారు.
ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల హడావిడిలో...
రామ్ మాధవ్ ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతను చూస్తున్నారు. త్రిపుర ఎన్నికలను రామ్ మాధవ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. త్రిపురలో ఎన్నికలు అయిపోయిన తర్వాత తమ రాష్ట్రానికి రామ్ మాధవ్ ను పంపాలని తెలంగాణ బీజేపీ నేతలు అధిష్టాన్ని కోరారు. ఇటీవల తెలంగాణ బీజేపీలో నైరాశ్యం అలుముకుంది. నడిపించేవారు లేక...అధిష్టానం పట్టించుకోకపోవడంతో వారు ఏమి చేయాలో కూడా తెలియని పరిస్థితి ఉంది. వ్యూహరచన చేసే వారూ ఇక్కడి నేతల్లో కరువయ్యారు. ప్రజల్లోకి నేతలు వెళుతున్న పెద్దగా స్పందన కన్పించడం లేదు. ఏవేవో కార్యక్రమాలు చేపడుతున్నా పార్టీ నేతల్లోనే నమ్మకాన్ని కల్గించలేక పోతున్నారు. పార్టీలోకి నేతలు వస్తారనుకుంటే..ఉన్న నేతలు కూడా జారుకునే పరిస్థితి నెలకొంది. ఇది బీజేపీ నేతలను ఆందోళన కల్గిస్తోంది. అందుకే రామ్ మాధవ్ ను ఇక్కడి నేతలు బలంగా కోరుకుంటున్నారు.
తెలంగాణపై పట్టుండటంతో....
ఆరు నెలల క్రితం అమిత్ షా వచ్చినప్పుడు మాత్రం హడావిడి కన్పించింది. ఆ తర్వాత షరా మామూలే. కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా తమకే ఉందని పైకి బీజేపీ నేతలు చెబుతున్నా అందుకు అనుగుణంగా ఏ పనినీ చేయలేకపోతున్నారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచలేకపోతున్నారు. మరోవైపు అధిష్టానం కూడా తెలంగాణ బీజేపీని పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. ఈ నేపథ్యంలోనే రామ్ మాధవ్ ను తమకు ఇన్ ఛార్జిగా పంపాలని అమిత్ షాను ఇక్కడి నేతలు కోరారు. వాస్తవానికి రామ్ మాధవ్ ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులుగా ఉన్నారు. మరో నేత మురళీధరరావు కర్ణాటక ఎన్నికలు ఉండటంతో అక్కడి బాధ్యతలను చూస్తున్నారు. అయితే రామ్ మాధవ్ కొంతకాలం క్రితం తనకు అప్పగించిన ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో సమీక్షలు జరిపారు. అప్పట్లో ఆయన టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. రామ్ మాధవ్ కు తెలంగాణ రాజకీయాలపై పూర్తి పట్టుఉండటంతో ఆయనకే పూర్తి బాధ్యతలు అప్పగించాలని ఇక్కడి నేతలు కోరుతున్నారు. రామ్ మాధవ్ హ్యాండ్ పడితే తమ దశమారుతుందన్నది వీరి ఆశ. మరి అమిత్ షా రామ్ మాధవ్ కు తెలంగాణ పార్టీ వ్యవహారాలను అప్పగిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
- Tags
- రామ్ మాధవ్

