ఇప్పుడు బాబు వంతు : హస్తిన యాత్ర, మోదీతో భేటీ!

దేశంలో 29 రాష్ట్రాలు ఉండగా.. తెలుగు రాష్ట్రాలు రెండు మాత్రమే కేంద్రానికి కీలకంగా లేదా చురుగ్గా ఉన్నట్టు కేంద్రానికి కనిపిస్తున్నాయా? నోటు దెబ్బకు కుదేలవుతున్న ప్రజల కష్టాల గురించి తెలుసుకోవడమూ, వాటిని పరిష్కరించడం గురించిన మార్గాలపై సలహాలు స్వీకరించడమూ, అలాగే డిజిటల్ లావాదేవీల దిశగా దేశాన్ని నడిపించడానికి కసరత్తు చేయడానికి ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటిదాకా భేటీ అవుతుండడం విశేషంగానే కనిపిస్తోంది.
ఏపీ ముఖ్యమంత్రి శనివారం ఢిల్లీ వెళుతున్నారు. నోట్ల రద్దు అనంతర పరిణామాలు, డిజిటల్ లావాదేవీలను పెంచడానికి కేంద్రం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడానికి ఆయన ప్రధాని మోదీతో సమావేశం కాబోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నిరోజుల కిందట ఇదే వ్యవహారాలపై ప్రధానికి లేఖ రాయడం, ఆయన ఆహ్వానం మీద దిల్లీ వెళ్లి.. భేటీ అయి... తన నివేదికను సమర్పించి రావడం జరిగింది. దేశంలో మిగిలిన ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మోదీ ఈ గ్యాప్ లో భేటీ కాలేదు గానీ.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సలహాలను తీసుకోబోతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధానికి సలహాలు చెప్పే అవకాశం రావడం అరుదుగానే.... లేదా ప్రముఖంగానే చెప్పుకోవాలి. నిజానికి భాజపా సీఎంలకు కూడా దక్కని గౌరవంగా భావించాలి. ఈ ఇద్దరిలో ఒకరు మిత్రపక్షం, మరొకరు విపక్షం అయినా ప్రధాని వారి సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటుండడం విశేషం.
డిజిటల్ కమిటీ భేటీ కూడా...
చంద్రబాబునాయుడు కన్వీనర్ గా జాతీయ స్థాయిలో ఏర్పడిన డిజిటల్ లావాదేవీల ఉన్నతస్థాయి కమిటీ సమావేశం కూడా 7, 8 తేదీల్లో ఢిల్లీలో జరగబోతోంది. ముఖ్యమంత్రులు, కీలక అధికారులు, నీతిఆయోగ్ ప్రతినిధులతో ఈ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా డిజిటల్ లావాదేవీల వైపు మొగ్గు చూపేలా చేయాలంటే ఏం చేయాలి? అనేదిశగా ఈ కమిటీ చర్చలు జరిపి, సూచనలను, విధివిధానాలను రూపొందించి కేంద్రానికి సిఫారసు చేస్తుంది. తానే కన్వీనరు కావడం వల్ల.. ఆ కమిటీ సమావేశం కూడా పూర్తయిన తరువాత.. చంద్రబాబునాయుడు తిరిగి రాష్ట్రానికి వస్తారు.

