ఇద్దరూ పిచ్చోళ్లే...! ఈ ప్రపంచానికి ఏమవుతోంది?

వీరిద్దరి దెబ్బకు ప్రపంచ దేశాలు గడగడ లాడుతున్నాయి. ఎప్పుడు ఏం ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న ఆందోళన అంతర్జాతీయ సమాజానికి నిద్రపట్టనివ్వడం లేదు. ఇద్దరూ.... ఇద్దరే. ఇద్దరిలో ఎవరూ తగ్గరు. ఇద్దరూ తలతిక్క మనుషులే. వీరి మెంటల్ పనులు యుద్ధానికి దారితీస్తాయోమోనన్న ఉత్కంఠ ప్రపంచదేశాలను వణికిస్తున్నాయి. ఇద్దరూ ఎవరూ తగ్గడం లేదు. మాటల యుద్ధానికి తెరతీశరు. ఇది ఎటువైపు దారితీస్తుందోనన్నది అంతర్జాతీయ మేధావులకూ అంతుచిక్కడం లేదు. వారే అమరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.
బటన్ నొక్కేస్తా....
గత కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరకొరియా ఇటీవల కొన్ని అణు పరీక్షలను కూడా జరిపింది. అమెరికానే లక్ష్యంగా చేసుకుని తాము అణుపరీక్షలు నిర్వహించామని ఉన్ అధికారికంగా ప్రకటించాడు. ఇక అంతటితో ఆగలేదు. కొత్త సంవత్సరం సందర్భంగా అమెరికాకు హెచ్చరికలు జారీ చేశాడు. ప్రతి సమయంలో తన వద్ద న్యూక్లియర్ బటన్ ఉంటుందని, అది ఎప్పుడు నొక్కుతానో తనకే తెలియదని ఉన్ వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియా జోలికి వస్తే అమెరికాను బుగ్గిపాలు చేయకతప్పదని కిమ్ హెచ్చరించారు.
నా బటన్ ఖచ్చితంగా పనిచేస్తుంది....
అయితే ఇందుకు ప్రతిగా ట్రంప్ కూడా తీవ్ర స్వరంతోనే కిమ్ కు వార్నింగ్ ఇచ్చి పడేశారు. తన దగ్గర కూడా న్యూక్లియర్ బటన్ ఒకటుందని, అది ఖచ్చితంగా పనిచసో్తుందని, చాలా శక్తివందమైందని ట్రంప్ ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఉత్తరకొరియా అధ్యక్షుడికి ఏమాత్రం తగ్గకుండా ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయి. కిమ్ హెచ్చరికలకు ఇక్కడ ఎవరూ భయపడబోరని ట్రంప్ తేల్చి చెప్పారు. మొత్తం మీద ఇద్దరూ ఎవరూ తగ్గకుండా మాటల యుద్ధం ప్రారంభించారు. అయితే ఇది చివరకు యుద్ధానికి దారితీస్తుందేమోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది.ఇటీవలే ఉత్తర కొరియా అణుబాంబులతో పాటు హైడ్రోజన్ బాంబును కూడా విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే.

