ఇద్దరు చంద్రులు ఇవాళ కలవబోతున్నారు

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు చంద్రులూ ఇవాళ మరోసారి కలవబోతున్నారు. కృష్ణా నదీజలాల పంపకం విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించుకునేందుకు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు గత నెల 21న భేటీ అయిన తర్వాత మళ్లీ పరస్పరం ఎదురుపడడం ఇవాళే కావొచ్చు. ఇవాళ కేంద్రమంత్రి దత్తాత్రేయ.. దసరా సందర్భంగా తాను ప్రతి ఏటా ఏర్పాటు చేసే అలయ్ బలయ్ కార్యక్రమాన్ని చాలా వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబునాయుడును కూడా ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారు. తెలంగాణ వంటకాల ప్రత్యేకంగా ఉండే ఆ విందులోనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇద్దరు చంద్రులు, నారా చంద్రబాబునాయుడు , కల్వకుంట్ల చంద్రశేఖరరావు కలవబోతున్నారు. దత్తాత్రేయ విందుకు గవర్నర్ నరసింహన్ కూడా హాజరవుతారు. మరెవ్వరైనా కేంద్రమంత్రులు కూడా రాబోతున్నారా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అయితే ఇద్దరు చంద్రుల కలయికే ఇక్కడ కీలకం. ఎందుకంటే..
గత నెల 21వ తేదీన వీరిద్దరూ చివరిసారిగా కలిసినప్పుడు.. ఏర్పడిన ప్రతిష్టంభన ఇప్పటికీ అలాగే ఉంది. కృష్ణా జలాల విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి ఆ సమావేశం జరిగినా ఫలితం మాత్రం కనిపించలేదు. కీలక అంశాల మీద రెండు రాష్ట్రాలు పట్టుదలలకు పోవడంతో.. ప్రతిష్టంభన మిగిలిపోయింది. ఆ భేటీ తర్వాత.. ఒకరినొకరు మాటలు అనుకోవడం, నిందించుకోవడం మాత్రం తగ్గలేదు. తమ జలాలను దొంగిలించుకుపోతున్నారంటూ హరీష్రావు వ్యాఖ్యానించడం ఆ తర్వాత కూడా కొనసాగింది. ఇలాంటి వాతావరణం ఇరు రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న తరుణంలో.. ఇద్దరు చంద్రుల భేటీలో ఎలాంటి హావభావాలు ప్రకటితం అవుతాయో.. ఎలాంటి సంభాషణ నడుస్తుందో ఆసక్తికరమే. అయితే వీరు రాష్ట్రాలకు సంబంధించిన కీలకాంశాలు ఏవీ మాట్లాడుకోకపోవచ్చుననీ. కేవలం విందుకు వచ్చిన ఇద్దరు అతిథులలాగానే.. ‘హాయ్’ చెప్పుకుని అక్కడితో ముగిస్తారని కూడా పలువురు భావిస్తున్నారు.

