ఇదే జరిగితే... జగన్ సీఎం అయినట్లే...!

వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఇస్తున్న హామీలన్నీనెరవేర్చే అవకాశముందా? జగన్ ఇస్తున్న హామీలు మామూలుగా లేవు. రోజురోజుకూ వీటి సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు పాదయాత్ర ప్రారంభం లోనే ఉన్నట్లు లెక్క. నవంబరు 6వ తేదీన ప్రారంభయిన జగన్ పాదయాత్ర కడప, కర్నూలు జిల్లాలో పూర్తయి ప్రస్తుతం అనంతపురం జిల్లాలో జరుగుతోంది. జగన్ పాదయాత్రకు మంచి స్పందనే లభిస్తుంది. అంతేకాదు వినతులు కూడా వెల్లువలా వస్తున్నాయి. ఉద్యోగ సంఘాల దగ్గర నుంచి సామన్యులు, రైతులు, కార్మికులు ఇలా ఒకరేమిటి వివిధ వర్గాల కు చెందిన ప్రజలు జగన్ ను కలిసి తమ గోడును విన్పిస్తున్నారు. పాదయాత్రలో ఉన్న జగన్ వెంటనే వారి సమస్యలను విని చలించిపోతున్నారు. వెంటనే హామీని ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తాము ఇచ్చిన హామీలను అమలుపరుస్తానని జగన్ పార్టీ ఖచ్చితంగా చెబుతోంది.
ధైర్యంగా ఇస్తున్న హామీలు...
ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఎన్నో సమస్యలు. మరెన్నో సవాళ్లు. అయితే ఈ నేపథ్యంలో జగన్ ఏ మాత్రం వెరవకుండా ధైర్యంగా హామీలు గుప్పించడం వైసీపీ నేతలకే ఆశ్చర్యం కలుగుతోంది. పింఛను మొత్తాన్ని రెట్టింపు చేస్తామన్నారు. మద్యం కారణంగా తమ కుటుంబాలు వీధిన పడుతున్నాయని మహిళలు జగన్ వద్దకు వస్తే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యనిషేధాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఇక ఉచిత విద్యుత్తు, దివ్యాంగులకు, వృద్ధులు, వితంతువులకు పింఛను రెట్టింపు చేస్తామన్నారు. ప్రస్తుతం దివ్యాంగులకు ప్రభుత్వం రూ.1500 పింఛను ఇస్తుంది. జగన్ దానిని మూడు వేలు చేస్తామన్నారు. వితంతువులకు వెయ్యి ఉన్న పింఛను రెండు వేలు చేస్తామని ప్రకటించారు. ఇక మసీదుల్లో పనిచేసే ఇమామ్ లకు పది వేల గౌరవభృతి కూడా ఇస్తామన్నారు.
ఎగబడుతున్న జనం....
గత ఎన్నికల్లో రుణమాఫీని వ్యతిరేకించిన జగన్ ఇప్పుడు మాత్రం రుణమాఫీని చేస్తామంటున్నారు. ఒకేసారి రుణమాఫీ చేస్తానని రైతాంగానికి హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తామని ప్రకటించారు. ఇక విద్యార్థులకు వంద శాతం ఫీజు రీఎంబర్స్ మెంటు ఇస్తామని చెప్పారు. ఉచిత విద్య అందరికీ అందిస్తామన్నారు. ఇక తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్తు ను అందిస్తామని హామీ ఇచ్చారు. ఆపై ఉన్న ఛార్జీలను కూడా తగ్గిస్తామని ప్రజలకు మాట ఇచ్చారు. ఇక జగన్ ను ఎక్కువగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలుస్తున్నారు. వారికి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెగ్యులరైజ్ చేస్తామనిచెప్పారు. అయితే జగన్ ఇస్తున్న హామీలు ఆచరణ సాధ్యమేనంటుంది వైసీపీ. మరోవైపు అధికారంలోకి రావడానికే జగన్ అలివికాని హామీలను గుప్పిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. మొత్తం మీద జగన్ నుంచి హామీలను పొందడానికి పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలు అశేషంగా తరలి వస్తుండటం విశేషం. అయితే జగన్ హామీలను జనం నమ్మితే మాత్రం విజయం తధ్యమన్నది విశ్లేషకుల అంచనా. జనం నమ్ముతారా? లేదా? అన్నది కాలమే తేల్చాలి.
- Tags
- జగన్

