ఇది పూర్తి కాకుంటే టీడీపీ పని అంతేనా?

నిధులివ్వండి ప్రాజెక్టు పూర్తవుతుంది అని అడుగుతోంది రాష్ట్రం. లేద్సార్ ఆధునికీకరణకు మీ లెక్కే మాకో అడ్డు అంటోంది కేంద్రం.12 ఏళ్ల ప్రాజెక్టుకు పది కష్టాలు.. ఇదీ తోటపల్లి దయనీయ చిత్రం.ఇదొక్కటే కాదు సిక్కోలులో టీడీపీ మనసుపెట్టి పూర్తిచేసిన ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటి లేదు. ఇప్పటిదాకా అనగా ఈ మూడున్నర ఏళ్ల కాలంలో.. కేవలం ఎత్తిపోతల పథకాలు మాత్రం కొన్నింట పూర్తయ్యాయి. అవి పూర్తయితే చాలు అనుకుంటే చెప్పేదేం ఉండదు. ఈ మూడున్నరేళ్లలో వంశధార పనులు చేపట్టి నిర్వాసితులను ఖాళీ చేయించి టీడీపీ కాస్తో కూస్తో పురోగతి సాధించింది అనుకోవడం పొరపాటు. అదేరీతిన మడ్డువలస, నారాయణపురం ఆధునికీకరణకు నిధుల పూజ్యం అన్నది అధికారులకు తెల్సు. ఈ రెండూ సక్రమంగా అందుబాటులోకి వస్తే లక్షా ఇరవై వేల ఎకరాలు సస్యశ్యామలమవుతాయి.
12 ఏళ్ల ప్రాజెక్టుకు 10 కష్టాలు...!
కానీ ఇది సాధ్యమా! చంద్రబాబు, దేవినేని ఉమ వీరి మధ్యలో అధికారులు ?? అంతా ఏం చేస్తున్నారు అంటే చోద్యం చూస్తున్నారు అని చెప్పక తప్పదు. రాజకీయ లబ్ధి కోసం వైఎస్సార్ సీపీ రెండు మార్లు వంశధార ప్రాజెక్టుపై గళమెత్తి, క్షేత్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తేనే సరా!! అదొక్కటే ఓ రాజకీయ పార్టీ సాధించిన విజయం అనుకుంటే ఏం చెప్పగలం.. ఇదే రీతిన బీజేపీ కూడా! వామపక్షాలు మినహా ఎవ్వరూ ప్రాజెక్టుల విషయమై ముఖ్యంగా నిర్వాసితుల విషయమై ఎవ్వరూ మాట్లాడరు. అందుకనో ఎందుకనో పనులు ముందుకు సాగవు.. కొనసాగే పనుల్లో నాణ్యత లేమి. ఈ దశలో సిక్కోలు జలసిరి అందరికీ అందేదెన్నడు.. ఈ తరుణంలో తోటపల్లి ప్రాజెక్ట్ వాచ్ మీ కోసం.
ఇదీ ప్రాజెక్టు కథ....
- సర్దార్ గౌతు లచ్చన్నతోటపల్లి ప్రాజెక్టుకు 2003 సెప్టెంబర్10న అప్పటి ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు శ్రీకారం దిద్దారు.2015లో సెప్టెంబర్ 10న ఉత్తరాంధ్ర ప్రజల కలలను సాకారం చేస్తూ దీనిని ఆవిష్కృతం చేశారు.దీని క్యాచ్ మెంట్ ఏరియా 4455 కిలోమీటర్లు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కలిపి లక్షా 20 వేల ఎకరాలను ఇది సస్యశ్యామలం చేయడం దీని లక్ష్యం.
- 1908లో బ్రిటిష్ కాలంలో తోటపల్లి వద్ద రెగ్యులేటర్ నిర్మించారు. తరువాత కాలంలో ఇక్కడ ప్రాజెక్టుని నిర్మించాలని తలపోశారు.విజయనగరం జిల్లా, గరుగుబెల్లి మండలం తోటపల్లి గ్రామం వద్ద నిర్మించిన ఈ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 2.51 టీఎంసీలు. డెడ్ స్టోరేజ్ 0.494 టీఎంసీలు, లైవ్ స్టోరేజ్ 2.509 టీఎంసీలు. ఇప్పటిదాకా ప్రాజెక్టుకు సంబంధించి 87శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. పిల్ల కాల్వల నిర్మాణానికి భూసేకరణ చేయాల్సి ఉంది. పనులు పూర్తి స్థాయిలో జరగకుండానే ముఖ్యమంత్రి ఆఘమేఘాల మీద ప్రాజెక్టునిప్రారంభించి జాతికి అంకింతం చేశారు. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగు నీరు రెండు జిల్లాలలకు అందించాలన్న యోచన ప్రతిపాదన దశలోనే ఉంది కానీ ఆచరణ ఇంకా అమలుకు నోచుకోవడం లేదు.
పూర్తైనవి.. పూర్తి కావాల్సినవి
- ప్రధాన కాలువలు
- డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తయ్యాయి.
- 450 కట్టడాలకు గాను 412 పూర్తి అయ్యాయి.
- పిల్ల కాలువల నిర్మాణానికి భూసేకరణ నిమిత్తం 9 కోట్ల రూపాయలు కావాల్సి ఉంది.
- పిల్ల కాలువల నిర్మాణానికి 98.74 ఎకరాలు సేకరించాల్సి ఉంది.
- ప్రధాన కాలువపై ఓ కట్టడం, డిస్ట్రిబ్యూటరీలపై 27 కట్టడాలు, పిల్ల కాలువల నిర్మాణం
వచ్చే జూన్ లోగా పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
ఆర్భాటాలే తప్ప..!!
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆర్భాటాలే తప్ప పనుల విషయమై ఒనగూరిందేమీ లేదు. తోటపల్లి ఆధునికీకరణకు, పెండింగ్ పనుల పూర్తికి 260 కోట్ల రూపాయలు మంజూరు చేస్తానని సీఎం చెప్పారే కానీ ఇంతవరకూ సంబంధిత నిధులే విడుదల కాలేదు. పిల్లకాలువల నిర్మాణానికి పార్వతీపురం యూనిట్ -1, యూనిట్ - 3, చీపురుపల్లి యూనిట్ - 2, బొబ్బిలి యూనిట్ - 4 పరిధిలోసుమారు 462 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అదేవిధంగా బొబ్బిలిలో బ్రాంచ్ కెనాల్ కు 372 ఎకరాలు సేకరించాల్సి ఉంది.ఇవన్నీ ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న పనులు. అమాత్యులు సమీక్షలకే పరిమితం అవుతున్నారే తప్ప సంబంధిత పనుల వేగవంతానికి ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులు రాబట్టడం లేదు. ఇక సాగునీటి పనులకే నిధులు కేటాయించాలన్న తలంపు టీడీపీ సర్కార్ కు ఉందనీ అనుకోలేం. ఉన్న నిధులు ఎప్పటికప్పుడు కొత్త హామీలను నెరవేర్చడానికే ఉపయోగిస్తున్నందున ఇప్పటికిప్పుడు కీలక ప్రాజెక్టుల పూర్తికి సీఎం నుంచి సుముఖత రావడం కష్టమే!
కేంద్రం నుంచి సాయం అంతంతమాత్రమే...
కేంద్రం కూడా ఈ విషయమై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో నిర్మితమవుతున్న ప్రాజెక్టుగా దీనికి పేరే కానీ మోడీ అండ్ కో ఆ దిశగా చేస్తున్న సాయం ఏదీ లేదు. దీంతో రెండు జిల్లాలకు సంబంధించి నిన్నమొన్నటి వేళ 64వేల ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యం కాస్తా 36 వేల ఎకరాలకే పరిమితమైంది.ఇక రాజకీయ పక్షాలు కూడా దీన్నొక ఎన్నికల స్టంట్ గా చూస్తున్నారే కానీ నిబద్ధతతో పూర్తిచేయాలన్న తలంపు ఏ ఒక్కరిలోనూ లేదు. వైఎస్సార్సీపీ కానీ బీజేపీ కానీ పనుల పూర్తిపై పెద్దగా మాట్లాడింది లేదు. కేంద్రం దగ్గర ఇక్కడి నేతలు పంచాయితీ పెట్టిందీ లేదు. దీంతో మిగిలిన కొద్ది పాటి పనులు కూడా పాలకులు, యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగానే పూర్తికాకుండానే ఉండిపోతున్నాయి. నిర్దిష్ట కార్యాచరణకు నిధుల ఊతం దొరికితేనే వచ్చే ఖరీఫ్ నాటికైనా కొంతలో కొంతైనా ఈ ప్రాజెక్టు పరిధిలో సాగు విస్తీర్ణం కాస్తైనా పెరిగే ఛాన్స్ ఉంటుంది.
- Tags
- ప్రాజెక్టులు

