ఇచ్చిన డబ్బుకు లెక్కేది ...?

ఏపీకి ఇప్పటివరకు 12500 కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చింది. వాటికి లెక్కలు అడిగితే ఒక్కరూపాయికి చెప్పలేదు. ఇక ఏమిస్తాం ఇలా అయితే అంటూ మోడీ సర్కార్ ఎదురుదాడికి దిగిపోయింది. ఇప్పటికే హోదా లేదు అని తేల్చేసిన కేంద్ర ఆర్ధిక శాఖ ఇప్పటివరకు ఇచ్చిన డబ్బుకే లెక్కరాలేదంటూ ఎదురు దాడి మొదలు పెట్టేసింది. ఈ వైఖరి టిడిపి సర్కార్ ను ఇరుకున పెడుతుంది.
అసెంబ్లీ వేదికగాను ...
ఎపి అసెంబ్లీ వేదికగా బిజెపి ఇదే వైఖరితో పోరాటం మొదలు పెట్టింది. అటు శాసనసభ, ఇటు శాసనమండలిలో మిత్రపక్షాలు కత్తులు దూశాయి. మీరు చేసింది ఏమి లేదంటూ అధికార పక్షం, ఇచ్చిన దానికి చెప్పిన సమాధానాలు ఏమిటంటూ మిత్రపక్షం ఒకరిపై మరొకరు ప్రత్యర్థుల్లా తలపడుతున్నారు. బిజెపి ఎమ్యెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్ రాజు ,ఎమ్యెల్సీ సోము వీర్రాజు అధికార పక్షాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారు. చంద్రబాబు పాలన అంతా అవినీతి మయం అయిపోయిందంటూ కమలనాధులు చెలరేగారు. వీరిలో సోము మరో అడుగు ముందు కు వేసి మోడీ మట్టి నీళ్ళు అమరావతికి ఇచ్చారంటూ దుష్ప్రచారానికి దిగిన టిడిపి దేశంలోని పవిత్ర నదుల నుంచి నీళ్లు ఎందుకు సేకరించింది అంటూ ప్రశ్నలు వేశారు. బాబు తీసుకువచ్చింది గాడిదపాలా అని నిలదీశారు.
మీరు గాడిద పాలు తాగుతున్నారా అన్న టిడిపి ...
సోము చేసిన వ్యాఖ్యలపై టిడిపి అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన బుద్ధా వెంకన్న ఘాటుగానే స్పందించారు. సోము వీర్రాజు గాడిదపాలు తాగుతున్నారేమో అంటూ ఎద్దేవా చేశారు. ప్రజాభిప్రాయాలను గౌరవించి హామీలు అమలు చేయాలని కోరారు. మాజీ మంత్రి డొక్కా వరప్రసాద్ బిజెపి తీరును తీవ్రంగానే విమర్శించారు.
