ఇక వ్యతిరేకులు గళం విప్పుతారా?

మోడీ, అమిత్ షాల వ్యూహం ఇక్కడ ఫలించలేదు. మోడీ ఓటమి అంటే ఏమిటో రుచి చూశారు. రెండు సిట్టింగ్ పార్లమెంటు స్థానాలను కోల్పోవడమంటే మోడీకిఎన్నికలకు ముందు ఇది కోలుకోలేని దెబ్బే. మోడీ ఒంటెత్తు పోకడలకు రాజస్థానీయులు తమ ఓటు పవరేంటో చూపారు. రాజస్థాన్ రాయల్స్ తామే అని భావించిన మోడీ, అమిత్ షాల దూకుడుకు ఆ రాష్ట్ర ప్రజలు కళ్లెం వేసినట్లయింది. అయితే ఓటమికి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే పనితీరే కారణమని కమలనాధులు పైకి చెబుతున్నా అది కొంతవరకే నన్నది అందరికీ సుస్పష్టం.ముఖ్యంగా పార్లమెంటు స్థానాలు కోల్పోవడమంటే మోడీ నిర్ణయాలకు చెక్ పెట్టడమేనన్నది విశ్లేషకుల అంచనా. ఇక సొంత పార్టీలోనూ, మిత్రపక్షాలు సయితం మోడీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా స్వరం పెంచే అవకాశముంది.
సెంటిమెంట్ కూడా....
రాజస్థాన్ లో జరిగిన అల్వార్, అజ్మీర్ పార్లమెంటు స్థానాలు రెండూ బీజేపీ గత ఎన్నికల్లో గెలిచినవే. అక్కడ ఎంపీల ఆకస్మిక మరణంతో ఉప ఎన్నికలు జరిగాయి.అయితే ఈ ఓటమికి అనేక కారణాలు చెబుతున్నారు. ముఖ్యంగా పద్మావత్ సినిమా ప్రభావం రాజ్ పుత్ లపై పనిచేసిందంటున్నారు. పద్మావత్ సినిమా విషయంలో వసుందర రాజే సర్కార్ వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగానే వారు బీజేపీకి దూరమయ్యారని తెలుస్తోంది. అజ్మీర్ లోక్ సభ స్థానానికి సన్వర్ లాల్ కుమారుడు రామ స్వరూప్ లాంబాకు టిక్కెట్ ఇచ్చారు. సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందనుకున్నారు. కాని ఓటర్లు మాత్రం సెంటిమెంట్ ను చూడలేదు. రెండు లక్షల మంది జాట్ ఓటర్లున్నారని ఆయనకు టిక్కెట్ ఇచ్చినా ఫలితం లేకపోయింది.
మంత్రిని రంగంలోకి దించినా....
ఇక అల్వార్ లోక్ సభ స్థానంలో ఏకంగా రాష్ట్ర మంత్రిని ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ రంగంలోకి దించింది. యాదవ కుల ఓటర్లు దాదాపు మూడున్నర లక్షల మంది ఉండటంతో ఆయన మంత్రిగా ఉన్నా అభ్యర్థిగా ఎంపిక చేసింది. అయినా ఇక్కడ కూడా ఫలితం రివర్స్ అయింది. లోక్ సభ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేను బాద్యుడిగా నియమించి మరీ ప్రచారాన్ని నిర్వహించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యంగా రాజ్ పుట్ లు, యాదవులు, బ్రాహ్మణులు, దళిత ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారన్నది అంచనా. జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావం కూడా ఈ ఎన్నికలపై పనిచేసిందంటున్నారు.
కాంగ్రెస్ లో జోష్....
ఇక ఈ ఉప ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ లో విశ్వాసం పెరిగింది. మోడీ హవా ఇంకా తగ్గలేదు అని సర్వేలు వెల్లడిస్తున్న వేళ ఉప ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం పెల్లుబుకుతోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎంపిక అయిన తర్వాత తొలి విజయం కావడంతో పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాహుల్ నాయకత్వంపై విశ్వాసాన్ని మరింత పెంచాయని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ లో జోష్ మరింత పెరిగింది.

