ఇక వైసీపీలో ఫుల్ జోష్...!

జగన్ పాదయాత్రకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ మూడు వేల కిలోమీటర్ల మేరకు జరగనున్న పాదయాత్ర సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం జగన్ పాదయాత్ర సాగే రూట్ లో అన్ని ఏర్పాట్లు చేశారు వైసీపీ నేతలు. ఆదివారం వైఎస్ జగన్ కడపకు చేరుకుంటారు. అక్కడ చర్చిలో ప్రార్థనలు జరిపిన అనంతరం ఇడుపుల పాయకు చేరుకుంటారు. సోమవారం ఉదయం వైఎస్సార్ ఘాట్ లోనివాళులర్పించిన అనంతరం జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. పాదయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు వైసీపీ నేతలు చెప్పారు. మరోవైపు జగన్ పాదయాత్ర వెళ్లే రూట్ లో ముందుగా ఒక మొబైల్ పార్టీ వెళ్లి చెక్ చేస్తుంది. ఆయన నడిచే దారంతటినీ పరిశీలిస్తుంది. సొంత జిల్లా కడప నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఏడు నెలల తర్వాత సిక్కోలు జిల్లాలో ముగుస్తుంది.
ఎన్ని మీటింగ్ లు... ఎన్ని సమాలోచనలు...
నిన్న తిరుమల వెళ్లిన జగన్ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిని కూడా కలిశారు. ఆయన ఆశీస్సులు పొందారు. మొత్తం 125 నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర జరగనుంది. పాదయాత్రలో మొత్తం 5 వేలకు పైగా సమావేశాలను జగన్ నిర్వహించనున్నారు. 180 చోట్ల ప్రభావిత సంఘాల సమావేశాలను జరుపుతారు. 125 భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయనున్నారు. పాదయాత్ర ప్రారంభమైన తర్వాత ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 8.30గంటల వరకూ కార్యకర్తల సమావేశంలో జగన్ పాల్గొంటారు. స్థానిక కార్యకర్తలతో కాసేపు ముచ్చటిస్తారు. తర్వాత ఆ ప్రాంత పార్టీ నేతలతోనూ చర్చిస్తారు. ఉదయం 8.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పాదయాత్ర సాగుతుంది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3గంటల వరకూ భోజన విరామ సమయంగా ప్రకటించారు. తిరిగి 3.30 గంటకు ప్రారంభమయ్యే యాత్ర రాత్రి 7.30గంటలకు ముగుస్తుంది. 7.30 గంటలకు నియోజవర్గ కేంద్రానికి చేరి అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. సోమవారం ఇడుపుల పాయలో బయలుదేరే జగన్ పాదయాత్ర పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల్లో వంద కిలోమీటర్లకు పైగానే సాగనుంది. కడప జిల్లాలో మొత్తం 7 రోజులు జగన్ పర్యటిస్తారు. అక్కడి నుంచి కర్నూలు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 270 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర సాగుతుంది. జగన్ పాదయాత్ర నేపథ్యంలో వైసీపీలో జోష్ పెరిగింది. తమ నేత తమ ఊరికే వస్తుండటంతో ఆయనకు స్వాగతం చెప్పేందుకు పార్టీశ్రేణులు ఏర్పాట్లుచేసుకుంటున్నాయి.
- Tags
- వైసీపీ

