ఇక్కడ మరో కొత్తపార్టీని చూస్తామా ...?

తెలంగాణ రాజకీయ తెరపైకి గులాబీ సర్కార్ ను ఛాలెంజ్ చేస్తూ కొత్త పార్టీ రావడానికి సిద్ధంగా ఉందని పొలిటికల్ టాక్. ఈ పార్టీ ఏర్పాటుకోసం ఇప్పటికే టిజెఎసి సారధి కోదండరాం లాంఛనాలు పూర్తి చేస్తున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 వ తేదీన పార్టీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. టీఆర్ఎస్ కి వ్యతిరేకంగానే టిజెఎసి పురుడు పోసుకుంటుందంటున్నారు. గులాబీ దళానికి వ్యతిరేకంగా వున్న అన్ని రాజకీయశక్తులను ఏకం చేసి ఒకేతాటిపైకి తెచ్చేందుకు సన్నాహాలు ఊపందుకున్న నేపథ్యంలో కోదండరాం పార్టీ పై చర్చలు మొదలయ్యాయి.
ఆహ్వానిస్తున్న టీఆర్ఎస్...
తెలంగాణ ఏర్పాటు తరువాత నుంచి టిజెఎసి నేత కోదండరాం కేసీఆర్ కి వ్యతిరేకంగా అనేక సమస్యలపై పోరాటాలు చేస్తూనే వస్తున్నారు. ఆయన ఉద్యమాలను ఎప్పటికప్పుడు సర్కార్ సమర్ధంగా అణచివేస్తూ టిజెఎసి ది పైచెయ్యి కాకుండా చేస్తూ వస్తుంది. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లోనూ టిజెఎసి కీలకపాత్ర పోషించినా ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా వచ్చాయి. ప్రభుత్వాలకు వుండే అడ్వాంటేజ్ ల వల్లే అలాంటి విజయాలు దక్కుతాయని సాధారణ ఎన్నికల్లో సమీకరణలే ప్రధానమని విశ్లేషకులు చెబుతున్నారు. తాజా రాజకీయ పరిణామాలు నిశీతంగా పరిశీలిస్తున్న గులాబీ పార్టీ టిజెఎసి కొత్త పార్టీ పెడతారన్న వార్తలపై స్పందిస్తూ మంచిదే అంటూ ఆహ్వానించడం విశేషం.
కాంగ్రెస్ తో జత కట్టనున్న టిజెఎసి ...
తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన టిజెఏసికి గ్రామస్థాయిలో పోరాటంలో పాల్గొన్న వారితో నేరుగా సంబంధాలు అన్ని ప్రాంతాల్లో వున్నాయి. నాటి పోరాటంలో టి సర్కార్ గుర్తించని చురుకైన నాయకులకు తమ పార్టీ నిర్మాణంలో బాధ్యతలు అప్పగించి పొలిటికల్ స్క్రీన్ పై తామేమిటో చూపాలన్నది కోదండరాం స్కెచ్. అధికార సాధన దిశగా టిఆర్ ఎస్ కి వ్యతిరేకంగా వున్న కాంగ్రెస్ తదితర పక్షాలతో జట్టుకట్టి పోరాడాలన్నది టిజెఎసి చీఫ్ ఆకాంక్ష అంటున్నారు. అయితే ఇప్పటికే కోదండరాం పై అధికారపార్టీ కాంగ్రెస్ ఏజెంట్ అనే ముద్రను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. దీన్ని కోదండరాం కూడా బలంగానే తిప్పికొట్టారు. తెలంగాణ రావడానికి కారణభూతమైన పార్టీ కాంగ్రెస్ కాబట్టే తాము ఆ పార్టీతో జతకట్టమనే కౌంటర్ ను జనంలోకి ఆయన తీసుకుపోయారు. టిజెఎసి కొత్త పార్టీ వెనుక కాంగ్రెస్ పార్టీ అదృశ్య హస్తం ఉందన్న ప్రచారం సాగుతుంది. మరోవైపు కాంగ్రెస్ కాకుండా సిపిఐ మాత్రమే టిజెఎసి పెట్టె కొత్తపార్టీతో జతకడుతుందని భావిస్తున్నారు. సిపిఎం వీరితో వివిధ కారణాల రీత్యా కలిసే అవకాశం లేదంటున్నారు. ఏదిఏమైనా ఎన్నికలు సమీపించే నాటికి తెలంగాణ లో రాజకీయ సమీకరణాలు పొత్తులు చిత్ర విచిత్రంగా వుండేలాగే కనిపిస్తున్నాయి. ఎన్నికల వేడి మాత్రం ఇప్పటినుంచి బాగా పెరిగిపోతూ రావడం విశేషం

