ఇక్కడ నంద్యాల ఫార్ములా అమలు చేస్తున్నారా?

కొడంగల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రేవంత్ రెడ్డి రాజీనామా విషయం ఎటూ తేలకపోయినా అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం కొడంగల్ పై దృష్టి పెట్టింది. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే విజయ బావుటా ఎగురవేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకు కేసీఆర్ నంద్యాల ఫార్ములాను ఎంచుకున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పుడు అభివృద్ధి పనులు వేగం అందుకున్నాయి. గత మూడున్నరేళ్లుగా అక్కడ రేవంత్ రెడ్డి ఉండటంతో అధికార టీఆర్ఎస్ ఆ నియోజకవర్గాన్ని లైట్ తీసుకుంది. ఇప్పుడు రేవంత్ రాజీనామాతో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినా... లేకుంటే సాధారణ ఎన్నికల్లోనైనా సరే కొడంగల్ లో గులాబీ జెండాను ఎగురవేసేందుకు ఇప్పటి నుంచే పథక రచనచేస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు ఇదే పనిలో ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం పై ఈ ముగ్గురు మంత్రులు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు.
నిత్యం సమీక్షలు... సర్వేలు...
ముఖ్యంగా మంత్రులు హరీశ్ రావు, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావులు కొడంగల్ నియోజకవర్గానికి చెందిన అధికారులను హైదరాబాద్ కు శాఖల వారీగా రప్పించుకుంటున్నారు. వారి పరిధిలో మిగిలిపోయిన కార్యక్రమాలు, చేపట్టాల్సిన పనుల గురించి తెలుసుకుంటున్నారు. కొన్ని పనులకు నిధులను కూడా విడుదల చేశారు. ముఖ్యంగా మంచినీటి వసతి, రోడ్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం వంటి వాటిని వెంటనే ప్రారంభించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. మరోవైపు మంత్రి హరీశ్ రావు తన టీమ్ తో కొడంగల్ లో సర్వే చేయిస్తున్నారు. ఎన్నికలు జరిగితే ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుంది? ఎవరికి ఇక్కడ ఓటు బ్యాంకు ఉంది. ప్రజలు ఏ నేత మాట వింటారు? అన్న దానిపై గ్రామస్థాయి నేతల గురించి హరీశ్ రావు ప్రత్యేక బృందంతో సర్వే చేయిస్తున్నారు. గ్రామస్థాయి, మండల స్థాయి నేతలను ఆకట్టుకోవడంలో భాగంగానే బలమైన నేతల గురించి హరీశ్ ఆరా తీస్తున్నారు. మొత్తం మీద కొడంగల్ ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా తాము సై అనేందుకు అధికార పార్టీ అన్ని విధాలుగా సమాయత్తమవుతుంది. నంద్యాల ఫార్ములాను ఇక్కడ అమలు చేస్తున్నారు.
- Tags
- కొడంగల్ నంద్యాల

