ఇక్కడ గుజరాత్ ఫీవర్...!

గుజరాత్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో...ఎవరు ఓడతారో తెలీదు. కాని గుజరాత్ ఎన్నికలు ఇక్కడ హీట్ పుట్టిస్తున్నాయి. ఇక్కడ రెండు ప్రధాన పార్టీలు గుజరాత్ ఎన్నికల ఫలితాలపై ఆశలు పెట్టుకున్నాయి. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఇక్కడ కూడా తమకు గెలుపు గాలి వీస్తుందన్నది ఒక పార్టీ నమ్ముతుంటే... అక్కడ బీజేపీ ఓడిపోతే తమకు ఇక్కడ గెలుపు సునాయాసమని మరొక పార్టీ భావిస్తుంది. గుజరాత్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 182 నియోజకవర్గాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోరు హోరాహోరీగా కొనసాగుతోంది. ఇరవై ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ఐదోసారి పవర్ లోకి రావాలని ప్రయత్నిస్తుంటే.... రెండు దశాబ్దాల తర్వాతైనా అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ కష్టపడుతోంది. అయితే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు మాత్రం గుజరాత్ ఎన్నికల ఫలితాలపై ఆశలు పెంచుకున్నారు.
బీజేపీ గెలిస్తే.....
గుజరాత్ లో బీజేపీ గెలిస్తే మోడీ హవా పెరిగిందని మరోసారి రుజువవుతుంది. దీంతో పార్టీ అధిష్టానం తెలంగాణపై దృష్టి పెడుతుంది. గుజరాత్ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై కూడా చూపుతాయని ఇక్కడి కమలనాధులు భావిస్తున్నారు. మోడీ మంత్రం ఇక్కడ కూడా పనిచేస్తుందని, గుజరాత్ ఎన్నికల తర్వాత జాతీయ నేతలంతా తెలంగాణ పర్యటనకు వస్తారని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణపై మోడీ ఫోకస్ చేస్తే తప్పకుండా తమకు అనుకూలంగా పరిస్థితి మారుతుందని వారు విశ్లేషిస్తున్నారు. ఇటీవల మోడీ పర్యటనతో కొంత ఊపు వచ్చిందని, గుజరాత్ ఎన్నికల తర్వాత అది మరింత పెరుగుతందంటున్నారు. ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేయడంపై జాతీయ నాయకత్వం దృష్టిపెడుతుందంటున్నారు.
కాంగ్రెస్ విజయం సాధిస్తే....
ఇక కాంగ్రెస్ కూడా గుజరాత్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ గంపెడాశలు పెట్టుకుంది. ఇరవై ఏళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీకి అక్కడ ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేస్తారని, ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తాయని చెబుతున్నారు. గుజరాత్ లో బీజేపీ ఓటమి పాలయితే ఆ పార్టీ పతనం ప్రారంభమైనట్లేనన్నది కాంగ్రెస్ అంచనా. దీంతో తెలంగాణలోనూ సులువుగా అధికారాన్ని చేజిక్కించుకోవచ్చని హస్తం పార్టీ నేతలు ఆశపడుతున్నారు. అక్కడ బీజేపీ ఓడిపోతే ఇక్కడ అసంతృప్తి నేతలు కూడా పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వస్తారని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద గుజరాత్ ఎన్నికల ఫలితాలపై ఈ రెండు పార్టీలు భారీగానే ఆశలు పెట్టుకున్నాయి. మరి ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయో చూడాలి.

