ఇందులో జగన్ మాటే ఫైనల్...!

వైసీపీ అధినేత జగన్ నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికపై నేడు కర్నూలు జిల్లా నేతలతో భేటీ అవుతున్నారు. ప్రస్తుతం పుట్టపర్తినియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ అక్కడే కర్నూలు నేతలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే కర్నూలు నేతలు పుట్టపర్తి ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే నిర్ణయంతో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరు అభ్యర్థిగా ఉంటారనేది ఈ సమావేశంలో తేలిపోనుంది. ఐదు నెలల క్రితమే కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమయింది. ఈ నెల26వ తేదీ వరకు మాత్రమే నామినేషన్ల గడువు ఉంది. దీంతో జగన్ ఈరోజు ఈ ఎన్నికపై నిర్ణయం తీసుకోనున్నారు.
నేడు తేలిపోనుందా.....?
కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని అనేకమంది నేతలు జగన్ కు సూచిస్తున్నారు. జగన్ పాదయాత్రలో ఉన్నందున ముఖ్యనేతలందరూ అక్కడే ఉంటారని, ఎమ్మెల్సీ ఎన్నికను మేనేజ్ చేయడం కష్టమని కొందరు భావిస్తున్నారు. మరికొందరు గెలవలేని ఎన్నికకు ఎందుకు ఖర్చు చేయడమని పోటీకి వెనక్కు తగ్గుతున్నారు. ఇందులో గత ఎన్నికల్లో పోటీచేసిన గౌరువెంకటరెడ్డి ఒకరు. ఇక శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఒకే కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్న భావన కలుగుతుందని ముఖ్యనేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అభ్యర్థి ఎవరనేది నేడు తేలనుంది. అయితే ఓటమి ఖాయమని తెలిసినా క్యాడర్ కోసం పోటీచేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. నంద్యాల ఉప ఎన్నిక ఓటమితో ఆపార్టీని ఎందరో నేతలు వీడారు. మరొక ఓటమని రుచిచూసేందుకు వైసీపీ సీనియర్లు సిద్ధంగా లేరు. మరి జగన్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ కాబట్టి ఈరోజు ఏం తేలనుందో చూడాలి.
- Tags
- జగన్

