‘ఇందిరమ్మ సేవలు’ ఊపిరిలూదుతాయనే ఆశ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శవాసనం వేసిన కాంగ్రెస్ పార్టీని తిరిగి లేపి నిలబెట్టడానికి గత రెండున్నరేళ్లుగా చేస్తున్న ఏ ప్రయత్నమూ నిలకడైన ఫలితం ఇవ్వలేదన్నది సత్యం. అయినా సరే.. పీసీసీ చీఫ్ రఘువీరారెరడ్డి.. పట్టు వదలని విక్రమార్కుడి లాగా.. ఏదో ఒక మాయ చేసి.. పార్టీని కాపాడుకోవాలనే తపనతో కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. తాజాగా ఇందిరమ్మ సేవలను బహుళ ప్రచారంలోకి తీసుకువెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇందిరమ్మ పేదలకు మేలు చేసింది అనే విషయాన్ని ప్రచారంలోకి తీసుకెళితే, ఆ పాయింటును ప్రజలకు గుర్తు చేస్తే.. తమ పార్టీకి మళ్లీ ఆదరణ పెరుగుతుందని ఆయన ఆలోచిస్తున్నట్లుగా ఉంది.
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఊపిరులూదే కార్యక్రమాన్ని పీసీసీ అధినేత సీరియస్‌గానే చేపడుతున్నారు. అందుకోసం ఆయన తాను సంకల్పిచింన ప్రతి కార్యక్రమాన్నీ సీరియస్‌గానే చేస్తున్నారు గానీ.. ప్రజల స్పందనే ఏమాత్రం ఉండడం లేదు. గతంలో ఆయన కార్డుల కార్యక్రమం చేసినా, మోదీకి మట్టి నీళ్లు పంపినా, సంతకాలు సేకరించినా, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేసినా.. ఏదో చెప్పుకోడానికి కార్యక్రమాల కింద ఖాతాలోకి వచ్చాయే తప్ప.. పార్టీకి జవజీవాలు ఇవ్వడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా ఉపయోగపడలేదు. ఇప్పటికీ పార్టీ నుంచి బయటకు వెళ్తున్న వారు కనిపిస్తున్నారే తప్ప.. ఈ పార్టీకి ఏదో ఒక నాటికి భవిష్యత్తు ఉంటుందనే భరోసాతో కనీసం ఇటువైపు చూస్తున్న వారు కూడా లేరు.
ఇలాంటి సంక్లిష్ట సమయంలో పీసీసీ రఘువీరాకు ఓ అవకాశం అందివచ్చింది. ఇందిరమ్మ శతజయంతి ఉత్సవాల సంవత్సరం వచ్చింది. ఇందిరాగాంధీ సేవలను గుర్తు చేస్తూ ఏడాది పాటు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సంకల్పించారు. దీనికి సంబంధించి అధిష్ఠానం నుంచి కూడా ఆదేశాలు రాగానే.. ఇందిరమ్మ శతజయంత్యుత్సవ కమిటీని వేసేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మిగిలి ఉన్న నాయకులందరినీ ఇందులో చేర్చారు. బడుగు బలహీన వర్గాలకు ఇందిరమ్మ చేసిన సేవల గురించి ఏడాది పాటు ప్రచారం చేస్తారట.. మరి ఈ కార్యక్రమం తమ పార్టీ బలం చేకూరుస్తుందనే ఆలోచన రఘువీరాకు ఏమైనా ఉన్నదేమో తెలియదు.
కానీ వాస్తవం ఏంటంటే.. ఇందిరమ్మ కాలానికి , ఇప్పటికి సంక్షేమం అనే పదానికి నిర్వచనం మారిపోయింది. అప్పట్లో ఆమె ప్రారంభించిన పథకాల్ని ఇప్పుడు ఘనమైనవిగా ప్రచారం చేసుకోవడం.. ప్రజలను ఆకట్టుకునే అవకాశం తక్కువ. అసలే ప్రజాగ్రహానికి గురై ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అందులోనూ పాతబడ్డ టెక్నిక్ తో ప్రచారం.. ఇక వారు ఎప్పటికి బాగుపడతారా? అని పలువురు అంటున్నారు.

