ఇంటి కన్నా జైలే బెటరా?

ఎప్పుడెప్పుడు జైలునుంచి బయటపడదామా అని నిన్న మొన్నటివరకు ఆమె ఎదురుచూశారు. శిక్షా కాలం ఉండటంతో ఇక జైలు జీవితమే కాలం కలిసొచ్చే వరకు గతి అని తెలుసుకుని సర్దుకుపోయారు. అలా ఉండగా భర్త అనారోగ్యం తరువాత మరణం తో లభించిన పెరోల్ తో బయటకు వచ్చారు. పెరోల్ లభించిదాని కంటే ముందే ఆమె జైలు కి వెళ్లిపోయారు. అదేమిటి మరికొద్దిరోజుల్లో పొడిగించండి అని ఎవరైనా జైలు జీవితం విసుగెత్తి కోర్టు ను అభ్యర్ధిస్తారు. కానీ ఇక్కడ సీన్ రీవర్స్. తమిళనాడులో అంతా చిన్నమ్మ గా పిలుచుకునే శశికళ తాజా పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. అసలు చిన్నమ్మ ఎందుకలా చేశారు. ఆమెకు ఏమైంది?
భర్త మరణంతో చెలరేగిన ఆస్తుల వివాదం...
జయలలిత సీఎం గా ఉన్నన్ని రోజులు అధికారం శశి కళ దే అన్నది బహిరంగ రహస్యమే. అలా ఆమె అనధికార సీఎం గా నడిచిన రోజుల్లో కూడబెట్టిన కోట్ల రూపాయల సంపదే ఆమెకు మనశ్శాంతి లేని జీవితాన్ని ప్రసాదించింది. భోగభాగ్యాలతో తులతూగిన చిన్నమ్మ భర్త నటరాజన్ మరణించాక అసలు వివాదం కుటుంబంలో మొదలైంది అంటున్నారు. ఆస్తుల పంపకాలపై కుటుంబ సభ్యుల నడుమ చెలరేగిన వివాదం చల్లార్చడంలో ఆమె సఫలీకృతం కాలేకపోయారని సన్నిహిత వర్గాల సమాచారం. దాంతో ఇంటికన్నా జైలే బెటరనుకుని పెరోల్ కి గడువు వున్నా శ్రీకృష్ణ జన్మస్థానమే మనశ్శాంతి ప్రసాదిస్తుందని శశి భావించి ఉంటారని అంటున్నారు. శశి పెరోల్ పై వున్నన్ని రోజులు ఆమెకు టి టివి దినకరన్ నీడలా ఉండటంతో ఆమెను కలిసి ఎదో చెప్పుకుందామని వచ్చిన వారు కూడా వెనక్కి పోయారని చెబుతున్నారు. మొత్తానికి జయ మరణం శశికి కష్టాలను ప్రసాదిస్తే ఆమె భర్త నటరాజన్ మరణం మనశ్శాంతి లేకుండా చెయ్యడం ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది.
