ఆ మూడు రోజులూ.. యమ డిమాండ్..!

ఆ మూడు రోజులూ... ధూం...ధామ్. రెండుతెలుగు రాష్ట్రాల్లో ఆ మూడు రోజుల్లో లక్షల సంఖ్యలో పెళ్లిళ్లు జరగననున్నాయి. ఈ తేదీలు దాటితే ముహూర్తాలు మరో మూడు నెలల వరకూ లేకపోవడంతో ఈ మూడు రోజుల్లో పెళ్లిళ్ల హడావిడి ఎక్కువగా కన్పిస్తోంది. ఈ నెల 23, 24, 25 వ తేదీల్లో పెళ్లిళ్లకు బలమైన ముహూర్తాలుండటంతో లక్షలాది జంటలు ఒక్కటవుతున్నాయి. దీంతో పెళ్లి మండపాలకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ లో అయితే ఆరోజు పెళ్లి చేసుకోవాలంటే రెట్టింపు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు పెండ్లి మంటపాల సమయాన్ని కూడా నిర్వాహకులు తగ్గించేవారు. గతంలో కల్యాణమండపాన్ని బుక్ చేసుకుంటే ఎనిమిది గంటల నుంచి 12 గంటల వరకూ వారు వాడుకునే వీలుంది. కాని పెళ్లిళ్ల రద్దీ ఎక్కవ కావడంతో ఆ సమయాన్ని నాలుగు గంటలకు తగ్గించేశారు.
రేట్లు పెంచేశారు....
ఇక పురోహితులకు డిమండ్ చెప్పనవసరం లేదు. ఎవరని సంప్రదించినా కుదరదని చెప్పేస్తున్నారు. దీంతో ఎక్కువ డబ్బులిచ్చి పురోహితులను తెప్పిస్తున్నారు. మరోవైపు కూరగాయల ధరలు మండిపోతుండటంతో ప్లేట్ భోజనం రేటు కూడా క్యాటరింగ్ సంస్థలు అమాంతం పెంచేశాయి. గతంలో రూ.250 నుంచి 350ల వరకూ తీసుకునే శాకాహార భోజనంఇప్పుడు రూ.500లు వసూలు చేస్తున్నారు. కేవలం 23, 24, 25 తేదీల్లోనే బలమైన ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. తర్వాత ఫిబ్రవరి 19వ తేదీ వరకూ ముహూర్తాలు లేకపోవడంతో ఈ మూడురోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది పెళ్లిళ్లు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రెండు లక్షలకు పైగానే పెళ్లిళ్లు జరుగుతున్నాయి.
- Tags
- పెళ్లిళ్ల సీజన్

