ఆ ప్రాంతం అంటే మోడీకి ఎంత ప్రేమో !!

సిగ్నల్ ఇచ్చేవాడు దేవుడు
బండి దిగిపోయేవాడు జీవుడు - ఇదీ జాలాది మాట
ఇక్కడ మాత్రం అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వక మోడీ తాత్సారం చేస్తున్నాడు. ఉత్తరాంధ్రపై ఎనలేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాడు. దీని ఫలితమే విశాఖ జోన్ ఏర్పాటుపై ముందుకు కదులుతున్న ఉద్యమం. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో ముఖ్యంగా ఆదాయాన్నిచ్చే వాల్తేరు మొదలుకొని పలాస వరకూ ఎక్కడా కూడా జనావసరాలకు అనుగుణంగా స్టేషన్ల అభివృద్ధి జరగడం లేదు. తీయగా వినిపించే మన్ కీ బాత్ సాక్షిగా చెబుతున్న చేదు నిజం ఇది. రండి.. ఒక్కసారి స్టేషన్లలో దుఃస్థితి సామాన్యుడి అవస్థలు తెలుసుకుందాం. విశాఖ జోన్ ఏర్పాటుకు ఉన్న ఆవశ్యకత ఏంటో కేంద్రానికి తెలియజెబుదాం. ఏ నిర్దిష్ట కార్యాచరణ లేనిదే ఫలితాలు రావు.. మోడీ, బాబు ఇద్దరూ ఇద్దరే ఎవరి ప్రయోజనాలు వారివే.. ఓ దశలో రాయపాటి లాంటి లాబీయిస్టులు గుంటూరులో జోన్ ఏర్పాటుచేయాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ఇప్పటికైనా గుంతకల్లు, విజయవాడ, గుంటూరు, వాల్తేరు డివిజన్లను కలిపి విశాఖ జోన్ గా ఏర్పాటుచేస్తే మేలు.
కనీస సౌకర్యాలు కరువు :
శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస స్టేషన్).. ముఖ్య నేతలకు కీలక స్థావరం.. నాటి రాజకీయ దురంధరుడు బొడ్డేపల్లి రాజగోపాలరావు మొదలుకొని నేటి కూన రవి (ప్రభుత్వ విప్) వరకూ.. కానీ ఎవ్వరికీ ఇక్కడి సమస్యలు పట్టవు. స్టేషన్ ఎన్నటికీ ఆధునికీకరణకు నోచుకోదు.జన సాంద్రతకు అనుగుణంగా రైళ్లు ఆగవు. ఈస్ట్ కోస్ట్ పరిధిలో ఉన్న ఈ జోన్ లో పట్టణ జనాభా లక్షా 25 వేల 939 మంది.. రోజూ ఈ స్టేషన్ మీదుగా 95 రైళ్లు ప్రయాణిస్తుంటాయి. శ్రీకాకుళం పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్టేషన్ ను ఏ గ్రేడ్ పరిధిలో చేర్చారు. ఇక్కడ నాల్గు ఫ్లాట్ ఫాంలు ఉన్నాయి. ప్రయాణికుల అవసరాల రీత్యా వీటిని పెంచాల్సి ఉంది. 1998 - 2000లో విద్యుద్దీకరణ చేశారు. ఇదొక్కటి మినహా పెద్దగా పనులు చేసింది లేదు. 1893లో ఈ స్టేషన్ ప్రారంభమైనట్లు సమాచారం. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాల రీత్యా విశాఖ, ఒడిశా పట్టణాలైన బరంపురం, రాయ్‌ఘడ్, టిట్లాఘర్, ఖుర్దారోడ్ లకు ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్‌లను, ప్యాసింజర్ రైళ్లను నడపాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఇక్కడ ఆగే రైళ్ల విషయమై బెర్తుల కేటాయింపు పెంచాలన్న ప్రతిపాదన ఒకటి వినవస్తోంది. జిల్లా కేంద్రంకు అతి చేరువగా ఉన్న ఈ స్టేషన్ ఏళ్లకు ఏళ్లు సమస్యలకు నిలయంగానే ఉంది. ఇక ఇదే జిల్లాలో ఉన్న తిలారు స్టేషన్ కోటబొమ్మాళి సమీపాన ఉంది. పంచాయతీలో జనాభా 3063 మంది.అంతేకాదు ఇక్కడికి సమీపానే నరసన్నపేట, టెక్కలి పట్టణాలు ఉన్నాయి. దూరప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లను ఇక్కడ నిలుపదల చేయాలని (హాల్టింగ్ కేటాయించాలని) డిమాండ్. చిన్న పంచాయతీ కావడం, నాయకుల అశ్రద్ధ కారణంగా తిలారు స్టేషన్ ప్రగతి పట్టాలెక్కడం లేదు.
అభివృద్ధి ఏదీ...?
విజయనగరం జిల్లాకే వస్తే ఇక్కడి గజపతినగరం స్టేషన్ ఏ కేటగిరీ స్టేషన్. ఐదు ప్లాట్ ఫాంలు ఉన్న ఈ స్టేషన్ లో నిత్యం 185 రైళ్లు రాకపోకలు సాగిస్తాయని ఓ అంచనా. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 2,27,533. జిల్లా కేంద్రం స్థాయిలో ఈ స్టేషన్ అభివృద్ధి చెందలేదు. పట్టణానికి బెర్తుల కోటా పెంచాల్సి ఉంది. కొన్ని ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నా ఇవేవీ అమలుకు నోచుకోవడం లేదు. ఐదు వేల జనాభా ఉన్న ఈ స్టేషన్ కు అభివృద్ధి ఆమడ దూరం. గతంలో బొత్స ఝాన్సీ ఇప్పుడు అశోక్ గజపతి రాజు వంటి నేతలు ఎంపీలుగా ఉన్నప్పటికీ ఈ జిల్లాకు ఒనగూరిందేమీ లేదు.
మొదటి నుంచి ఇంతే!!
స్థూలంగా ఉత్తరాంధ్ర ప్రాంతం రైల్వే పరంగా ఎంతో వెనుకబడి ఉంది. ఈస్ట్ కోస్ట్ ప్రదర్శిస్తున్న చిన్నచూపు కారణంగా ఇక్కడి స్టేషన్లు ఆధునికీకరణకు కాదు కదా కనీసం మౌలిక వసతులకు కూడా నోచుకోలేకపోతున్నాయి. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు, కొత్త రైళ్లు, విద్యుద్దీకరణ, డబ్లింగ్, కొత్త మార్గాల సర్వే, స్టేషన్ల అభివృద్ధి ఇలా ఏ రకంగా చూసినా ఈ ప్రాంతం వెనుకబడే ఉంది. ప్రయాణికుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో రైళ్ల సంఖ్య పెరగడం లేదు. ముఖ్యంగా అటు ఉత్తరాది, ఇటు ఒడిశా పెత్తనం కారణంగా ఏటా ఉత్తరాంధ్ర నష్టపోతూనే ఉంది.
ఇంకొంత:
- విశాఖ - తిరుపతి మధ్య డబుల్ డెక్కర్ రైలును నడపాలన్న డిమాండ్ సాకారం కావడం లేదు.
- విశాఖ మీదుగా ప్రయాణించే వారణాసి ఎక్స్‌ప్రెస్ లో ఈ ప్రాంత రిజర్వేషన్ల కోటా పెంచాలన్న డిమాండ్ పట్టించుకునే నాథుడే లేడు.
- విశాఖ నుంచి కాకినాడ, పలాస, రాయగఢ్ లకు ఈఎంయూ రైళ్లను నడపాలన్న అభ్యర్థననను అటకెక్కించారు.
- నిత్యం ప్రయాణికులు, రైళ్లతో రద్దీగా ఉండే విశాఖ స్టేషన్లో నాలుగు ప్లాట్ ఫాంలను అదనంగా నిర్మించాల్సి ఉంది.
- విశాఖ - గోపాలపట్నం మద్య మూడో మార్గాన్ని నిర్మించాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు.
ఇవన్నీ విశాఖ జోన్ ఏర్పాటుతోనే నెరవేరే అవకాశాలు పుష్కలం. అందుకు రాజకీయ నేతల సంకల్పమే అత్యంత కీలకం.
- Tags
- రైల్వే జోన్

