ఆ పదవులు...వారికేనా?

అన్నాడీఎంకే రొట్టె విరిగి నేతిలో పడిందా? ఆ రెండు పదవులనూ ప్రధానిమోడీ అన్నాడీఎంకేకు ఇస్తారా? మరో మిత్రపక్షమైన జేడీయూకు కూడా చోటు కల్పిస్తారా? ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అన్నాడీఎంకేకు అనుకూలంగా మారనున్నాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వనని తెగేసి చెప్పడంతో టీడీపీ కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పౌరవిమానయాన శాఖకు చెందిన అశోక్ గజపతిరాజు, సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయమంత్రి సుజనా చౌదరి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
అన్నాడీఎంకు అవకాశమివ్వనున్నారా?
అయితే ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ప్రభుత్వం నుంచి తప్పుకోవడంతో ఆ రెండు పదవులను తిరిగి మిత్రపక్షాలకే మోడీ ఇస్తారన్న టాక్ హస్తినలో గట్టిగా విన్పిస్తోంది. 2019 ఎన్నికలకు మోడీ కేబినెట్ విస్తరిస్తారని కూడా చెబుతున్నారు. ఈ విస్తరణలో ఏపీ వదులుకున్న రెండు పదవులను అన్నాడీఎంకేకు ఇస్తే బాగుంటుందన్న యోచనలో కమలనాధులున్నారు. దక్షిణాదిలో నిలదొక్కుకోవాలని గట్టిగా భావిస్తున్న కమలం పార్టీ జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే నేతలకు చేరువయింది.
రాజ్యసభలో బలం లేనందున.....
అన్నాడీఎంకే లోని రెండు వర్గాలు పళనిస్వామి, పన్నీర్ సెల్వంలను కలిపింది కూడా ఢిల్లీ పెద్దలేనన్నది అందరికీ తెలిసిందే. పళనిస్వామి, పన్నీర్ సెల్వం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నారు. గత ఏడాది సెప్టంబరులో మోడీ తన కేబినెట్ ను విస్తరించారు. ఆ విస్తరణలోనే అన్నాడీఎంకేకు కేంద్రంలో చోటు లభిస్తుందన్న ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో అది సాధ్యం కాలేదు. రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి మెజారిటీ లేదు. మిత్రపక్షాలను మంచి చేసుకోవడానికే మోడీ మొగ్గు చూపుతారన్నది వాస్తవం. అందుకోసమే అన్నాడీఎంకే, జేడీయూలకు అవకాశం ఉంటుందన్నది హస్తినలో ప్రచారం జరుగుతుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మోడీ మంత్రి వర్గ విస్తరణ చేపట్టే అవకాశముందని తెలుస్తోంది.
- Tags
- మోడీ
