ఆ తీర్పు వచ్చే లోగానే....!

ఆ తీర్పుపైనే ఇప్పుడు అందరి ఉత్కంఠ. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు 18 మందిపై స్పీకర్ ధన్ పాల్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే అనర్హత వేటుపై ఎమ్మెల్యేలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం మాత్రం తీర్పు రిజర్వ్ లో ఉంచింది. అయితే ఈ తీర్పు పాఠం వెలువడేలోగా బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్ణయించుకున్నారు. తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే అసెంబ్లీ సమావేశాల్లో తనపై అవిశ్వాసం పెట్టే అవకాశముంది. అందుకోసమే తమిళనాడు బడ్జెట్ సమావేశాలను ఈ నెల 16వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు జరపాలని పళనిస్వామి నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అవిశ్వాసం పెడతారని....
మరోవైపు దినకరన్ వర్గం కూడా తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. తమకు అనుకూలంగా వస్తే పళని సర్కార్ పై అవిశ్వాసం పెట్టాలన్నది వాళ్ల ఆలోచన. ఇందుకు డీఎంకే మద్దతు ఉంటుంది. అలాగయితే పళని ప్రభుత్వం కూలిపోయినట్లే. ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలు తాము పళని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు లేఖలు ఇచ్చారు. ఇప్పుడు శాసనసభలో అన్నాడీఎంకే సభ్యుల సంఖ్య 114 మంది మాత్రమే. ప్రతిపక్షాల బలం 102. ఈ 18 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే ప్రతిపక్షాల బలం 120 కు చేరుకుంటుంది. అప్పుడు పళనిస్వామి ప్రభుత్వానికి కష్టాలు తప్పవు. తీర్పు వారికి అనుకూలంగా రాకపోతే మాత్రం పళని గట్టెక్కినట్లే.
ముందుగానే బడ్జెట్ సమావేశాలు...
అందుకోసమే ఇప్పుడు పళనిస్వామి తీర్పు వచ్చే ముందే బడ్జెట్ సమావేశాలను పెట్టాలని నిర్ణయించారు. సమావేశాలను కూడా కేవలం ఐదు రోజులకే పరిమితం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ సమావేశాల్లో పళనిస్వామి ప్రతిపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొనక తప్పదు. ప్రధానంగా బస్సు ఛార్జీల పెంపుపై విపక్షాలు ధ్వజమెత్తనున్నాయి. అలాగే ఎమ్మెల్యే జీతాల పెంపును కూడా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. జీతాల పెంపు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 55 వేల నుంచి లక్షా ఐదు వేలకు పెంచారు. నియోజకవర్గ నిధులను రెండు కోట్ల నుంచి రెండున్నర కోట్లకు పెంచారు. ఇలా ఎమ్మెల్యేలను మంచి చేసుకోవాలన్నది పళనిప్లాన్. అయితే డీఎంకే మాత్రం రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల జీతాలు ఎలా పెంచుతారని ప్రశ్నిస్తుంది. ఇక డిసెంబరు 16వ తేదీన జరగనున్న తమిళనాడు బడ్జెట్ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత ఏడాది సరిగ్గా అదేరోజున పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
- Tags
- పళనిస్వామి

