ఆ.... ఇద్దరే అచ్చన్నకు విలన్లు

సిక్కోలు రాజకీయాల్లో తిరుగులేని చరిష్మా ఉన్న నేత అచ్చెన్న పేరుకి చెడ్డపేరు తీసుకువస్తున్నది ఇద్దరు.. ఆ ఇద్దరూ లేకుంటే రైతు లేడు.. ఆ ఇద్దరూ లేకుంటే ప్రగతి లేదు. ఎవరా ఇద్దరు ఏమా కథ? అందులో ఒకరు బ్యాంకర్లు రెండు మిల్లర్లు .. ఈ ఇద్దరూ మంత్రి పరువు ఏక కాలంలో తీస్తున్నారు. రైతులకు రుణాలివ్వక గ్రామీణ వికాస్ బ్యాంకులు, రైతులు దగ్గర ధాన్యం కొనేందుకు మిల్లర్లకు ష్యూరిటీ ఇవ్వని బ్యాంకర్లు.. రెండు రైతు నుంచి బియ్యం కొనేందుకు సుముఖత వ్యక్తం చేయక నాన్చుడు వ్యవహారంతో మంత్రి ఇజ్జత్ కి సవాల్ విసురుతున్న మిల్లర్లు. ఈ ఇద్దరూ చాలు మంత్రి పరువు గంగలో కలిపేందుకు. ఆయనెంతగా చెబుతున్న హెచ్చరిస్తున్నా ఈ ఇద్దరూ వినడం లేదు. ఫలితంగా జిల్లా రైతు దగ్గర మంత్రి అచ్చెన్న తలదించుకోవాల్సి వస్తోంది.
ఇదీ మిల్లర్ల కథ...
గత ఏడాది మాదిరిగానే వే బిల్లు డ్రామాలాడేందుకు మిల్లర్లు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ అధికారులు వాటినన్నింటినీ ఛేదించగలిగారు. మీడియా అప్రమత్తతతో నాటి నాటకానికి తెరపడడమే కాక సమస్యాత్మక మిల్లర్లను ప్రత్యేకించి ఓ జాబితాలో చేర్చారు. ఇప్పుడు వీరికే మళ్లీ ధాన్యం కొనుగోలుకు కొందరు అధికారులు సై అనడం విడ్డూరం. అంటే అన్నారు వీరు మాత్రం పాత విధానంలో ధాన్యం కొంటామని, కొత్త విధానం వద్దని అంటున్నారు. బ్యాంకు ష్యూరిటీలు లేనందున తాము కొనలేమని చేతులెత్తేస్తున్నారు. ఇక పీఏసీఎస్‌లు, పలు మార్కెట్ సంఘాలు రైతు నుంచి ధాన్యం కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపనందున రైతు గగ్గోలు పెడుతున్నాడు. ఇప్పటిదాకా నిర్దేశిత లక్ష్యంలో అంటే ఎనిమిది లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నా వీరు అతి తక్కువ మోతాదులోనే కొన్నారు. దీంతో అచ్చెన్న రంగంలో దిగి సీమ మిల్లర్లను ఇటు రప్పించి లెవీలో వాటా ఇవ్వాలని యోచిస్తున్నారు.
డీసీసీబీ సయితం...
ఆయన ఎంత చెప్పినప్పటికీ వీరెవ్వరూ ఆయన మాట కాస్త కూడా వినడం లేదు. వినిపించు కోవడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో 131 కొనుగోలు కేంద్రాలు తెరవగా అందులో కేవలం ఒక్క రైతు నుంచి మాత్రమే 5.54 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు.ఇదీ వారం కిందటి సమాచారం.. పోనీ ఇప్పటికైనా ఏమైనా మార్పు వచ్చిందా అంటే అదీ లేదు.మిలర్ల తీరు కారణంగా నా పరువే కాదు ప్రభుత్వం పరువూ తీస్తున్నారంటూ మండిపడుతున్నారు.అదే విధంగా డీసీసీబీ వ్యవహారం కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. మంత్రి వార్నింగ్ ల మీద వార్నింగ్‌లు ఇస్తున్నా నో యూజ్.
మరో విలన్ బ్యాంకర్...
గ్రామీణ వికాస్ బ్యాంకర్లలెవ్వరూ మంత్రి మాటని పాటించడం లేదు. దీంతో ఆయన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ)కి ఫిర్యాదు చేస్తానని అంటున్నారు. పొదుపు సంఘాలను ప్రోత్సహించేందుకు పసుపు కుంకుమ కింద చెల్లించాల్సిన మొత్తాలనూ నేటికీ లబ్ధిదారుల ఖాతాలో జమ కాలేదు. మహిళా సంఘాలకు రుణాలు అందడం లేదని, శ్రీకాకుళం జిల్లాలో వెయ్యి సంఘాలకు ఇప్పటికీ పసుపు - కుంకుమ పథకం కింద తమ ప్రభుత్వం విడుదల డబ్బులు జమ కాలేదని మండిపడ్డారు. పేదవారికి ముద్ర రుణాలు అందడం లేదని, నోరున్న వారికే రుణాలు ఇవ్వడం తగదని లీడ్ బ్యాంక్ మేనేజర్ పై సీరియస్ అయ్యారు. మొత్తంగా ఈ ఇద్దరూ (బ్యాంకర్లు, మిల్లర్లు) మంత్రి ఇలాఖాలో తమకు తోచిన రీతిన పనిచేసుకుంటూ, అటు రైతులకు, ఇటు లబ్ధిదారులకు ఏ విధమైన సాయం అందించక మొండికేస్తున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరు గారడమే కాక అచ్చెన్న మాట ఎక్కడా నెగ్గుకురావడం లేదు.
- Tags
- అచ్చెన్నాయుడు

