ఆ ఇద్దరినే జగన్ టార్గెట్ చేశారా?

అనంతపురంలో పట్టు బిగించేందుకు జగన్ సిద్ధమయ్యారు. ముఖ్యంగా జేసీ బ్రదర్స్ కు జనస్పందనతోనే చెక్ పెట్టేందుకు సమయాత్తమవతున్నారు. జగన్ ప్రస్తుతం అనంతపురం జిల్లాలో మూడోరోజు పాదయాత్రను చేస్తున్నారు. అనంతపురంలో ఆయన ప్రధాన ప్రత్యర్థులు జేసీ బ్రదర్స్... పరిటాల కుటుంబమే. అందుకోసం ఈసారి ఎలాగైనా జేసీ బ్రదర్స్ ను, పరిటాల కుటుంబాన్ని దెబ్బ తీయాలన్నది జగన్ వ్యూహంగా కన్పిస్తుంది. అందుకోసమే జగన్ అనంతపురం జిల్లా పాదయాత్రలో ఈ రెండు నియోజకవర్గాలను ప్రధానంగా ఎంచుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గానికి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి , రాప్తాడు నియోజకవర్గానికి మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో తాడిపత్రి, రాప్తాడు నియోజకవర్గాలపైనే పాదయాత్రలో ఎక్కువగా దృష్టి పెట్టారు.
తాడిపత్రి... రాప్తాడులో....
అనంతపురం జిల్లాలో మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో 250 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం గుంతకల్ లో పర్యటిస్తున్న జగన్ తర్వాత జేసీ బ్రదర్స్ కంచుకోట అయిన తాడిపత్రి నియోజకవర్గంలోకి పాదయాత్ర చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో 13.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఇక పరిటాల సునీత నియోజకవర్గమైన రాప్తాడులో 46. 5కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో తన ప్రత్యర్థులను వచ్చే ఎన్నికల్లో చిత్తు చేసేందుకు జగన్ నడక మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలోకి ప్రవేశించిన జగన్ కు అపూర్వ స్వాగతం లభిస్తోంది. తాడిపత్రి, రాప్తాడులో కూడా అదే రెస్పాన్స్ వస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
28వరోజు పాదయాత్ర ఇలా....
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 28వ రోజుకు చేరుకుంది. ప్రజాసంకల్పయాత్ర నేటి ఉదయం 8గంటలకు పెదవడుగూరు మండలంలోని కొట్టలపల్లి నుంచి ప్రారంభం కానుంది. అక్కడి నుంచి కొట్టలపల్లి సెంటర్, నాగాలపురం క్రాస్ రోడ్స్, గంజ్ కుంటపల్లి, చిట్టూరు, తరిమెల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది.
- Tags
- జగన్

