ఆళ్లగడ్డలో జగన్ జపం..!

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో భాగంగా ఆళ్లగడ్డ చేరుకున్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో జగన్ కు ఊహించని స్వాగతం లభించింది. ఆళ్లగడ్డ వీధులన్నీ జనంతో నిండిపోయాయి. ఆళ్లగడ్డ భూమా ఫ్యామిలీకి పెట్టని కోట. ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచే భూమా ఫ్యామిలీ ఎదిగింది. ప్రస్తుతం ఆళ్లగడ్డ నుంచి మంత్రి అఖిలప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ప్రజాసంకల్ప యాత్రను ఆళ్లగడ్డ మీదుగా వెళ్లేలా వైసీపీ నేతలు ప్లాన్ చేశారు. తను నమ్మి టిక్కెట్ ఇస్తే పార్టీ ఫిరాయించడమే కాకుండా, పార్టీపైనే బురద చల్లుతున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డకు వచ్చిన జగన్ ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. దీంతో ఆళ్లగడ్డ పట్టణం కిక్కిరిసిపోయింది. జగన్ తో సెల్ఫీలు దిగేందుకు యువతీ, యువకులు పోటీ పడ్డారు. ఆళ్లగడ్డ నాలుగురోడ్ల కూడలిలో జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
అఖిలప్రియ పై ఫైర్....
ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల జంక్షన్ లో రాత్రి బసచేసిన జగన్ ఉదయం 8గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. యాత్ర ప్రారంభించి నేటికి పదో రోజు అయింది. పదిరోజుల్లో దాదాపు 120 కిలోమీటర్ల మేరకు నడిచారు. ఆర్. కృష్ణాపురం నుంచి నిన్న యాత్ర కొనసాగగా వేలాది మంది వైసీపీ కార్యకర్తలు ఆయన వెంట నడిచారు. ఆళ్లగడ్డ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజల సమస్యే వైసీపీ మ్యానిఫేస్టోగా ఉంటుందని చెప్పారు. ప్రతి గ్రామంలో సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజాసమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. అంతేకాదు వచ్చేది మన ప్రభుత్వమేనని, సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని జగన్ ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు.మంత్రి అఖిలప్రియపై జగన్ ఫైర్ అయ్యారు. 21 మందిని బోటు ప్రమాదంలో పొట్టన పెట్టుకున్న మంత్రి అఖిలప్రియ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను గొర్రెలను కొన్నట్లు కొనుగోలు చేసి కొందరికి మంత్రిపదవులు, మరికొందరికి డబ్బులు ఇచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు.
- Tags
- ఆళ్లగడ్డలో జగన్

