ఆర్కే నగర్ లో దినకరన్ దే విజయమా?

ఆర్కేనగర్ ఉప ఎన్నిక వేడెక్కింది. గెలుపు కోసం అన్నాడీఎంకే, దినకరన్, డీఎంకేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆర్కేనగర్ లో జరిగిన ఒక సర్వే దినకరన్ కు అనుకూలంగా ఫలితాలు రావడంతో అన్ని రాజకీయ పార్టీలూ కంగుతిన్నాయి. చెన్నైకి చెందిన ప్రొఫెసర్ రాజనాయగం ఆర్కే నగర్ లో సర్వే చేశారు. ఈ సర్వేలో దినకరన్ కు అనుకూల ఫలితాలొచ్చాయి. ఈ సర్వేలో దినకరన్ కు 35.5 శాతం ఓట్లు రాగా, రెండో స్థానంలో డీఎంకే అభ్యర్థి మరదు గణేశ్ నిలవడం విశేషం. మరదు గణేశ్ కు 28.5 శాతం మంది మద్దతు పలికారు. మూడో స్థానంలో అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్ 21. 3 శాతం తో ఉన్నారు. ఈ సర్వే ఫలితాలను ప్రొఫెసర్ వెల్లడించడంతో ఆర్కే నగర్ లో పార్టీలు అప్రమత్తమయ్యాయి. అయితే ఈ సర్వే చేసిన సమయానికి పోలింగ్ కు కొంత సమయం ఉండటంతో ఫలితాలు మారే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సానుభూతి అంటున్న....
మరోవైపు గత ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు టీటీవీ దినకరన్ ప్రభుత్వంలో ఉన్న పళనిస్వామి మద్దతుతో పోటీ చేశారు. అప్పుడు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక్కొక్క ఓటుకు ఐదు వేల వరకూ ఇచ్చారని, ఇక గిఫ్ట్ లు అయితే చెప్పకర్లేదని చెబుతున్నారు. గతంలో విచ్చలవిడిగా దినకరన్ ఖర్చు పెట్టడం వల్లనే ఆయన పట్ల ఆర్కే నగర్ ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు శశికళ జైలు కెళ్లడం, వారి కుటుంబ సభ్యుల ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయడం వంటి సంఘటనలు కూడా దినకరన్ పై సానుభూతిని తెచ్చిపెట్టాయన్నది అంచనా.
అప్రమత్తమయిన అన్నాడీఎంకే....
సర్వే దినకరన్ కు అనుకూలంగా రావడంతో ముఖ్యమంత్రి పళనిస్వామి అప్రమత్తమయ్యారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. విపరీతంగా హామీలు గుప్పిస్తున్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పేందుకు ఇద్దరూ కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ ఎన్నికలో గెలుపు అవసరమని, అందుకే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు ఇరువురు నేతలూ గట్టిగానే సూచించారు. మరోవైపు డీఎంకే కూడా రెండో స్థానంలో ఉండటంతో ఓటు బ్యాంకును మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. స్టాలిన్ అక్కడే మకాం వేసి ప్రచారంలో పాల్గొంటున్నారు. మొత్తం మీద ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఈ సర్వే ఉత్కంఠను రేపిందనే చెప్పాలి.
- Tags
- దినకరన్

