ఆర్కేనగర్ లో అమితుమీ...!

ఎట్టకేలకు నేడు ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరగనుంది. ఖాళీ అయిన నియోజకవర్గానికి ఆరు నెలల్లో ఎన్నిక జరగాల్సి ఉండగా, ఆర్కే నగర్ విషయంలో అది సాధ్యం కాలేదు. ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలోచికిత్స పొందుతూ గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలోనే ఆర్కేనగర్ కు ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ విడుదలయినప్పటికీ విచ్చలవిడిగా దాదాపు 90 కోట్లు ఓటర్లకు పంచారన్న ఆరోపణలతో ఆర్కేనగర్ ఉప ఎన్నికను అప్పట్లో ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. అయితే తిరిగి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడంతో నేడు ఆర్కే నగర్ పోలింగ్ జరగనుంది.
నేడు పోలింగ్....భారీ భద్రత...
ఆర్కే నగర్ లో మొత్తం 2.54 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఎన్నికల కమిషన్ అధికారులు మొత్తం 256 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1178 ఈవీఎంలను సిద్ధం చేశారు. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆర్కే నగర్ నియోజకవర్గం సమస్యాత్మకంగా గుర్తించిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికను స్వయంగా పరిశీలిస్తుంది. ఈసారి డబ్బు ప్రభావం లేకుండా చేసేందుకు అనేక చర్యలు తీసుకుంది. అయినా 120 కోట్ల రూపాయలు పంచారని డీఎంకే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.
హైడ్రామాలు...ఉత్కంఠ....
ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ముఖ్యంగా అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్, శశికళ మేనల్లుడు దినకరన్, డీఎంకే అభ్యర్ధి మరదు గణేశ్ ల మధ్యనే పోటీ ఉంది. అయితే ఎన్నికలకు కొద్ది గంటల ముందే జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియోను దినకరన్ వర్గం ఎమ్మెల్యే వట్రివేల్ విడుదల చేశారు. ఇది తమిళనాడులో సంచలనంగా మారింది. జయలలిత ఆ వీడియోలో పాలు తాగుతున్న దృశ్యాలు కన్పిస్తున్నాయి. సెప్టంబరు 25వ తేదీన ఆ వీడియోను స్వయంగా శశికళ తీశారని వట్రివేల్ చెబుతున్నారు. దీనిపై అన్నాడీఎంకే, డీఎంకేలు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ సీరియస్ అయింది. ఎమ్మెల్యే వట్రివేల్ వివరణ కోరింది. వట్రివేల్ పై చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్కే నగర్ లో సర్వేలు మాత్రం దినకరన్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి.మొత్తం మీద ఆర్కేనగర్ ఉప ఎన్నిక క్షణం క్షణం ఉత్కంఠతను రేపుతోంది. మరి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి.
- Tags
- ఆర్కే నగర్

