ఆయనలా అవుదామనా?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాడీఎంకే ఓటు బ్యాంకును టార్గెట్ చేసినట్లే కన్పిస్తోంది. ఆయన ఇప్పటికే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారంచుట్టబోతున్నారు. తమిళనాడులో అన్నాడీంకేకు క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు బలంగా ఉంది. డీఎంకే, అన్నాడీఎంకేకు సంప్రదాయంగా ఉన్న ఓటు బ్యాంకు జయలలిత బతికి ఉన్నంత వరకూ చెక్కు చెదరలేదు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే గ్రూపులుగా విడిపోయింది. ఓటు బ్యాంకును రక్షించుకునే నేత కూడా ఆ పార్టీలో లేరన్నది వాస్తవం. చరిష్మా, సత్తా ఉన్న నేతలు ఆ పార్టీలో లేరన్నది కాదనలేని నిజం.
నాయకత్వ లేమితో....
ఈనేపథ్యంలో అన్నాడీఎంకే వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగినా నామమాత్రంగానే ఉంటుందన్నది పరిశీలకుల అంచనా. పన్నీర్, పళనిస్వామిలను నమ్మి ఓటేసే పరిస్థతి లేదు. జైలు నుంచి వచ్చే శశికళ పార్టీని పటిష్టంగా నడుపుతారన్న నమ్మకమూ లేదు. అందువల్లనే తలైవా కన్ను ఆ పార్టీ క్యాడర్, ఓటు బ్యాంకుపై పడింది. అందుకోసమే ఎంజీఆర్ ను కీర్తించారు రజనీకాంత్. తాను అధికారంలోకి వస్తే ఎంజీఆర్ లా పాలన సాగిస్తానని చెప్పారు. అలాగే జయలలిత సమర్థత మీద తనకు నమ్మకం ఉందన్నారు. తాను జయలలితకు భయపడే రాజకీయాల్లోకి రాలేదన్న విమర్శలను రజనీ కొట్టిపారేశారు.
ఎంజీఆర్ లాగానే పాలిస్తా....
జయలలిత పరిపాలన సామర్థ్యంపై తనకు నమ్మకం ఉండబట్టే ఆరోజు రాజకీయాల్లోకి రాలేదన్నారు. కాని ఇప్పుడు మాత్రం ఆ అవసరం కన్పిస్తుందన్నారు. తమిళనాడు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని, ప్రజాసమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజనీ మరోసారి ప్రకటించారు. ఎంజీఆర్ లాంటి యుగపురుషులు మరో వెయ్యి ఏళ్ల వరకూ జన్మించరని, అయితే ఆయన పాలన అందించేందుకు మాత్రం తాను ప్రయత్నిస్తానని రజనీకాంత్ మాట ఇచ్చారు. ఎంజీఆర్ విగ్రహావిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు.
త్వరలో అన్నాడీఎంకే నుంచి చేరికలు....
రజనీరాక సందర్భంగా ఆయన అభిమానులు రజనీ, ఎంజీఆర్ కటౌట్లను పెద్దయెత్తున ఏర్పాటు చేశారు. భవిష్యత్ ముఖ్యమంత్రి రజనీకాంత్ అంటూ పెద్దయెత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్ల వెనక మాజీ అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగం మద్దతుదారులు ఉన్నారు. ఇప్పటికే అన్నాడీఎంకేలోని అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు రజనీ పార్టీ వైపు చూస్తున్నారు. రజనీకున్న క్రేజ్, ఇమేజ్ తో గెలుపు గ్యారంటీ అనుకుంటున్న నేతలు త్వరలోనే పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఈ చేరికలన్నీ రజనీ పార్టీ ప్రకటించిన తర్వాతనే ఉంటాయని చెబుతున్నారు.
