ఆపరేషన్ - 2018 లో ఎవరి వాట ఎంతెంత ??

కొత్త ఏడాది వచ్చేసింది. ఇంకేం మన నాయకులు ఎవరి ఏర్పాట్లలో సారీ....ఎవరి పాట్లులో వారు.. మునిగిపోతున్నారు. పోలవరం ఒకరికి కాళేశ్వరం మరొకరికి జీవిత కాల లక్ష్యాలయ్యాయి. సంతోష సూచికను పెంపొందించడమే అంతిమంగా పనిచేస్తామన్నది ఏపీ సీఎం చంద్రబాబు, 24 గంటలూ వ్యవసాయ బోర్లకు విద్యుత్ అందించడమే ధ్యేయమంటూ పొరుగింటి సీఎం చంద్రశేఖరరావు చెబుతున్నారు. బాగుంది. ప్రధానమీడియాలో ఇద్దరి ప్రకటనలూ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగమే!
వలసలు ఆగవు ....
వైసీపీ నుంచి టీడీపీ ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. ఇంకా ఇంకొందరు సిద్ధంగా ఉన్నారు. వీరిని ఆకర్షించడమే ధ్యేయంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. మరి! ఇంతటి గడ్డు కాలంలో జగన్ పాదయాత్ర జనాన్ని ఆకర్షిస్తుందా అనేది చూడాలి. ఇక ఏపీలో సాధించాల్సినవాటిపై బాబు అండ్ కో దృష్టిపెట్టి అభివృద్ధి సాధించాలి. కానీ ఇది సాధ్యమా అన్నది ఓ ప్రశ్న. జన్మభూమి కార్యక్రమం మొదలుపెడుతున్నదే జనాకర్షణలో భాగం కనుక ఈ సారి వారి ఆకాంక్షలు ఏవిధంగా తీరుస్తారో చూడాలిక...
సిక్కోలులో అచ్చెన్న ఆకర్ష ఫలించేనా ...
ఇప్పటికే అంబానీ గ్రూపునకు భావనపాడు షిపింగ్ యార్డ్ పనులు అప్పగించామని, వీటి పూర్తితో పాటు మేజర్ మైనర్ ఇరిగేషన్ పనులు పూర్తి చేస్తామని అచ్చెన్న చెబుతున్నారు. కానీ ఇంతవరకూ సంబంధిత పనులకు ఎన్ని నిధులు వస్తాయో అన్నది తేటతెల్లం కాలేదు.అలానే ఎంపీ రామూ కూడా తన ఆపరేషన్ ఆకర్షని షురూ చేశారు. ఈయన పార్లమెంట్ వేదికగా మిగతా ఎంపీల కన్నా కాస్తో కూస్తో తన గళం బాగానే వినిపిస్తున్నారు. ఇంకా కొన్ని అదనపు ఆకర్షణల జోలికిపోతే.. సిక్కోలు రాజ్యాధికారం సాధనకు మళ్లీ కిల్లి కృపారాణి(మాజీ మంత్రి) పావులు కదుపుతున్నారు.ఈ కోవలోనే టీడీపీలోకి వచ్చేందుకు ట్రై చేస్తున్నారు. వైసీపీ మాత్రం ఈమె రాక విషయాన్ని పెండింగ్లోఉంచుతూనే ఉంది. ఇక వైసీపీలో బలంగా ఉన్న నేతలను ద్వితీయ శ్రేణిలో కాస్తో కూస్తో ఓటు బ్యాంకు ఉన్నవారిని ఇటుగా తీసుకువచ్చే పనిని జిల్లా టీడీపీ నేతలు ఎప్పుడో షురూ చేశారు. ఈ సారి మత్స్చకార, కాళింగ ఓటర్లే అన్నింటా కీలకం కానున్నారు. అందుకే ధర్మాన మొదలుకొని అచ్చెన్న దాకా వైసీపీ నుంచీ టీడీపీ దాకా ఆయా సామాజిక ఓటర్లను తమ గాలంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.సో.. నేతల ఆకర్షణ మంత్రం ఫలిస్తేనే రానున్న ఎన్నికల ఏడాదిలో గెలుపు. అందుకనో ఎందుకనో ప్రతీ నేతా ప్రజల కోసమే తాము అన్నట్లు జనం మధ్యే ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

