ఆనం ఇలాకాలో ఇదేం గోల?

అధికార పార్టీ నేతలు దాడికి దిగుతున్నారు. తాము చెప్పిన పని చేయలేదని ఉద్యోగులను టార్గెట్ చేసుకుంటున్నారు టీడీపీ నేతలు. ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని టీడీపీ నేతలు కోరుతున్నా... నిబంధనలకు విరుద్ధంగా ఎలా చేస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో ఇటీవల నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఇందూరు వెంకటరమణారెడ్డి ఆర్ఐ జహీర్ అహ్మద్ పై దాడికి దిగారు. చేయిచేసుకున్నారు. ఈ ఘటనలో ఆర్ఐకి గాయాలయ్యాయి. దీంతో రెవెన్యూ ఉద్యోగులంతా ఒక్కటయ్యారు. తమపై దాడి చేయడమేంటని మండిపడ్డారు. ఆందోళనకు దిగారు.
ఆందోళనకు దిగిన ఆనం...
విషయం తెలుసుకున్న కలెక్టర్, ఎస్పీలు వెంటనే దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూస్థానిక పోలీసులను ఆదేశించారు. దీంతో దాడి చేసిన వెంకటరమణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తమ పార్టీ వారినే అరెస్ట్ చేస్తారా? అంటూ పోలీసు స్టేషన్ ఎదుటే ఆందోళనకు దిగారు. రెవెన్యూ అధికారులపై కూడా కేసులు పెట్టాల్సిందేనంటూ బైఠాయించారు. లేకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు.
పట్టించుకోని మంత్రులు....
దీంతో నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం ఇరకాటంలో పడింది. కాని జిల్లా కలెక్టర్, ఎస్పీ మాత్రం ఉద్యోగుల పక్షానే నిలబడ్డారు. పార్టీనేతలు చెప్పి పనిచేయించుకోవాలే తప్ప ఇలా భౌతిక దాడులకు దిగడమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. నిబంధనలకు విరుద్ధంగా, అడ్డగోలుగా పనిచేయమని అధికార పార్టీ నేతలు అధికారులపై వత్తిడి తేవడం మామూలై పోయింది. పనులు చేయకుండానే బిల్లులు చేయించుకోవడం పరిపాటిగా మారింది. మరోవైపు ఇంత జరుగుతున్నా జిల్లా మంత్రులెవరూపట్టించుకోవడం లేదు. ఆత్మకూరు ఆనం ఇలాకా కావడంతో తాము జోక్యం చేసుకోవడం ఎందుకని మంత్రులు సోమిరెడ్డి, నారాయణ భావిస్తున్నట్లుంది. దీంతో వివాదం మరింత ముదిరింది. రెవెన్యూ సిబ్బంది మొత్తం సమావేశమై ఆందోళన చేయడానికి సిద్ధమయ్యారు. మొత్తం మీద నెల్లూరు జిల్లాలోని ఆనం ఇలాకాలో జరిగిన ఈ ఘటన పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆనంవ్యతిరేకులు ఇప్పటికే చంద్రబాబుకు కూడా ఫిర్యాదుచేసినట్లు తెలిసింది.

