ఆది....కేశవరెడ్డీ.... ఇంత అన్యాయమా?

నంద్యాల ఉప ఎన్నిక జరిగే సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి ఓటూ అక్కడ కీలకమని భావించిన చంద్రబాబు అనేక హామీలు గుప్పించారు. ఇందులో కేశవరెడ్డి బాధితులకు ఆయన ఊరటినిచ్చే మాటలు చెప్పారు. కేశవరెడ్డి నుంచి ఆస్తులు స్వాధీనంచేసుకుని ఎవరిసొమ్ము వారికి అప్పజెబుతానని చంద్రబాబు నమ్మకంగా చెప్పారు. నంద్యాల ఉప ఎన్నిక ముగిసి ఆరు నెలలు గడుస్తోంది. టీడీపీ విజయం సాధించింది. కాని కేశవరెడ్డి బాధితులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేకపోయారన్న విమర్శ విన్పిస్తుంది. తాజాగా కేశవరెడ్డి బాధితుడు అమరావతికి వచ్చి ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం కల్గించింది. సచివాలయం దగ్గర బాధితుడి కుటుంబం నిరసనకు దిగింది. 2012లో కేశవరెడ్డికి మూడులక్షల రూపాయలు ఇచ్చింది. 2015లో ప్రస్తుత మంత్రి ఆదినారాయణరెడ్డి తాను డబ్బులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కాని ఇంతవరకూ నెరవేరలేదు. నంద్యాల ఉప ఎన్నికల్లోనూ ఇదే మాట చెప్పారు. కాని ఇప్పటి వరకూ తమ డబ్బులు తమకు ఇప్పించలదేని అమరావతి సచివాలయం వద్ద ఓ వ్యక్తి తన భార్య, పిల్లలతో కలిసి నిరసనకు దిగారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం ఇప్పించాలని కోరారు. అయినా అతని గోడు ఎవరూ విన్పించుకోలేదు. గతంలో ఒకసారి ఇదే కుటుంబం ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ వద్ద ఆత్మహత్యాయత్నానికి దిగింది. అప్పుడు కూడా ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ఆ కుటుంబం వాపోతుంది.
నంద్యాల ఉప ఎన్నికల్లో హామీ....
నంద్యాలలో కేశవరెడ్డి విద్యాసంస్థల యజమాని కేశవరెడ్డి భారీగా తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లువసూలు చేశారు. దాదాపు 270 కోట్ల రూపాయలు వసూలు చేసిన కేశవరెడ్డి తర్వాత చేతులెత్తేశారు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయగా ప్రభుత్వం ఈకేసును సీఐడీకి అప్పగించింది. అయితే కేశవరెడ్డి చేతిలో నష్టపోయిన వారు ఎక్కువమంది నంద్యాల నియోజకవర్గంలోనే ఉన్నారు. కేశవరెడ్డి మంత్రి ఆదినారాయణరెడ్డికి స్వయానా వియ్యంకుడు కావడంతో మంత్రి అండదండలతోనే కేసును నీరుగారుస్తారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్లిన మంత్రులకు, ముఖ్యమంత్రికి కేశవరెడ్డి బాధితులు తమ మొరను వినిపించారు. అయితే అప్పట్లో ఎన్నిక కాబట్టి అందరూ డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కేశరెడ్డి ఆస్తులను స్వాధీనం చేసుకుని తిరిగి సొమ్ములు వచ్చేలా చేస్తామని చెప్పిన వారు ఇప్పుడు పత్తాలేకుండా పోయారని బాధితులు లబోదిబో మంటున్నారు. అయితే వీరి గోడు పట్టించుకునే వారే ప్రస్తుతం కరువయ్యారు. మళ్లీ ఎన్నికలు వస్తే తప్ప...వీరి ఆవేదనను ఆలకించేలా లేరు.

