అలా చేస్తే బీజేపీ ఊరుకుంటుందా?

టీడీపీ ఎదురుదాడికి బీజేపీ తగిన సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంది. నిన్న శాసనసభలో మోడీ గతంలో తరుపతి, నెల్లూరు బహిరంగ సభల్లో మాట్లాడిన క్లిప్పింగ్ లను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై బీజేపీ కేంద్ర నాయకత్వం సీరియస్ అయినట్లు తెలిసింది. సాక్షాత్తూ ప్రధానిని కించపర్చేలా ఏపీ శాసనసభలో వ్యవహరించిన తీరును పార్టీ కేంద్ర నాయకత్వం తప్పుపడుతోంది. ఎన్డీఏ నుంచి విడిపోయిన తర్వాత తమనే టార్గెట్ చేసుకున్నా సహనం వహంచామని, అయితే ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీ గతంలో మాట్లాడిన క్లిప్పింగ్ లను చూపించి అవమానపర్చే విధంగా వ్యవహరించడంపై హస్తిన కమలం పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్ర నాయకత్వం నుంచి ఆదేశాలు...
చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడిన ప్రసంగంతో పాటు, మోడీ వీడియో క్లిప్పింగ్ లను శాసనసభలో ప్రదర్శించిన విషయాన్ని స్థానిక బీజేపీ నేతలు కే్ంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు ప్రసంగాన్ని ఇంగ్లీషు, హిందీల్లో తర్జుమా చేసి మరీ పార్టీ కేంద్ర కార్యాలయానికి ఫ్యాక్స్ చేశారు. ఇవన్నీ చూసిన కమలం పార్టీ అగ్ర నేతలు ఇకపై అమితుమీ తేల్చుకోవాల్సిందేనని నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఇకపై టీడీపీని ఉపేక్షించవద్దని, ఎక్కడికక్కడ ఎండగట్ఠాలని బీజేపీ నేతలకు ఆదేశాలు అందాయి.
గవర్నర్ కు ఫిరాయింపులపై.....
దీంతో పాటు శాసనసభలో ప్రధాని మోడీని అవమానపర్చే విధంగా వీడియో క్లిప్పింగ్ లను ప్రదర్శించడంపై తొలుత గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని బీజేపీ నిర్ణయించింది. చంద్రబాబు సభా మర్యాదలను ఉల్లంఘించారంటూ గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేయడంతో పాటు పార్టీ ఫిరాయింపులపై కూడా కంప్లయిట్ చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. గవర్నర్ ఎలాంటి చర్య తీసుకోకుంటే రాష్ట్ర పతి దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు వెనకాడబోమని తెలిపారు. నీతి, నిజాయితీల గురించి నిత్యం మాట్లాడే చంద్రబాబు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎలా మంత్రి పదవులు ఇచ్చారని, ఈ విషయంపై తాము పోరాడతామని చెబుతున్నారు. అసలు ప్రధాని, ఉప రాష్ట్రపతి వీడియో క్లిప్పింగ్ లను శాసనసభలో ప్రదర్శించడానికి స్పీకర్ ఎలా అనుమతిచ్చారని ఎమ్మెల్సీ మాధవ్ ప్రశ్నించారు. చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలని మాధవ్ ఘాటుగా విమర్శించారు.
