అమ్మ కోసం స్పెషల్ టీమ్ : అనుమానాలు యథాతథం

తమిళనాడు అమ్మ పురట్చితలైవి జయలలితకు చికిత్స అందించడానికి మళ్లీ ప్రత్యేక డాక్టర్ల బృందం వచ్చింది. పరిస్థితి సీరియస్‌గా మారిన తొలిరోజే లండన్ నుంచి వచ్చిన వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ బాలె అప్పుడే వెళ్లిపోయారు. తాజాగా ఆయన మళ్లీ వచ్చారు. ఈసారి అయిదురోజుల పాటూ చెన్నైలోనే ఉండి అమ్మకు వైద్యసేవలు అందించేలా ఆయన వచ్చారు. ఆయనతో పాటూ ఢిల్లీనుంచి వచ్చిన ఎయిమ్స్‌కు చెందిన వైద్య నిపుణుల బృందం కూడా జయలలిత చికిత్సలో సహకరించబోతున్నారు.
చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ ముమ్మరంగానే జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పురట్చితలైవి ఆరోగ్యం కుదుటపరచి.. ఆమెను తిరిగి పూర్వస్థితికి తీసుకువచ్చేలా చేయడానికి వైద్యులు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లుగా అర్థమవుతోంది.
అయితే అదే సమయంలో రాష్ట్రప్రజల్లో ప్రత్యేకించి జయలలిత అభిమానుల్లో భయాలు, అనుమానాలు మాత్రం నివృత్తి కావడం లేదు. ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న వారికి భరోసా కల్పించేలాగా వైద్యనిపుణుల నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం.. ప్రభుత్వం అధికారికంగా ఒక్కమాట కూడా చెప్పకపోవడం ప్రజలకు ఇబ్బందికరంగానే ఉంది. నిజానికి అభిమానులకు భరోసా కల్పించే మాట ఒక్కటి కూడా వెల్లడి కాకపోవడం వల్లనే.. గురువారం ఇద్దరు అమ్మ భక్తులు ఆత్మాహుతులకు పాల్పడడం కూడా జరిగిందని పలువురు విశ్లేషిస్తున్నారు. దానికి తోడు అమ్మ ఆస్పత్రిలో ఉండగానే జరిగిపోయిన అధికారం బదలాయింపు జనంలో భయాల్ని పెంచింది. కనీసం ప్రభుత్వం అమ్మ ఆరోగ్యంగురించి ప్రజలకు సంతోషం కలిగించే అధికారిక ప్రకటన చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

