అమ్మ కుదుటపడుతోంది.. ఇంటికి రావడమే తరువాయి!

తమిళనాడులోని అభిమానులను తీవ్ర ఉత్కంఠకు, ఆందోళనకు గురిచేసిన పురట్చితలైవి జయలలిత ఆరోగ్యం నెమ్మదిగా బాగుపడుతోంది. ప్రస్తుతం ఆమె అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నట్లేనని, తనకు అందుతున్న చికిత్సతో పాటు ఇతర వ్యవహారాల గురించి కూడా అడిగి తెలుసుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇన్నాళ్లూ అపోలో ఆస్పత్రిలోని ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్న జయలలితను, ఐసీయూ నుంచి ఎల్ బ్లాకులోని వీఐపీ వార్డుకు తరలించినట్లుగా అధికారికంగా.. అపోలో వైద్యులు ప్రకటించారు. దీంతో జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతున్నదనే దిశగా అభిమానులకు మరింత భరోసా దొరికినట్లయింది.
ఒకవైపు జయలలిత అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ప్రత్యేకపూజలు, హోమాలు, యాగాలు చేయడం బుధవారం నాడు కూడా రాష్ట్రంలో కొనసాగుతూనే ఉన్నాయి. జయలలిత నెలన్నర కిందట అపోలో ఆస్పత్రిలో చేరిన తర్వాత, ఆమె ఆరోగ్యం ప్రమాదకర స్థితికి చేరిన నాటినుంచి అభిమానులు రకరకాల పూజలు, యజ్ఞాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఐసీయూనుంచి వార్డుకు మారడం అంటేనే జయలలిత ఆరోగ్యం చాలా వరకు కుదుటపడినట్లేనని అభిమానులు సంతోషిస్తున్నారు. కొన్నిరోజుల వ్యవధిలో జయలలితను అపోలో నుంచి ఇంటికి తరలించేస్తారని కూడా ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలా ఉండగా.. జయలలితను అనారోగ్యం బారినుంచి బయటపడేసేలా అత్యుత్తమ చికిత్స అందించినందుకు బ్రిటన్ కు చెందిన డాక్టర్ రిచర్డ్ బీలేకు లండన్ లో తమిళులందరూ కలిసి సత్కారం కూడా చేయడం విశేషం. జయలలితకు చికిత్స అందించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. బ్రిటన్ లోని తమిళుల తరఫున దురైకన్నన్ బీలేను సత్కరించారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా పదికోట్ల మంది తమిళులు జయలలిత ఆరోగ్యం కోసం పడుతున్న ఆరాటం చూసి తాను ఆశ్చర్యపోయానంటూ డాక్టర్ రిచర్డ్ బీలే వ్యాఖ్యానించడం విశేషం.

