అమ్మకానికి క్రికెటర్లు రెడీ ...!

ఐపీఎల్ లో క్రికెటర్ల వేలంపాటకు రంగం సిద్ధమౌతోంది. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఆటగాళ్లు ఈ వేలంలో అమ్ముడుపోవడానికి రెడీ అయ్యారు. ఈనెల 27,28 వ తేదీల్లో గోవాలో వేలంపాటకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1122 మంది ఐపీఎల్ లో ఆడేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. వీరిలో ఒక్క భారత్ నుంచి 778 మంది అత్యధికంగా పాల్గొంటుంటే 58 మంది ఆస్ట్రేలియా, 57 మంది దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ ల నుంచి 39 మంది 30 మంది న్యూజిలాండ్,26 మంది ఇంగ్లాండ్ దేశాలకు చెందిన వారు వున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల అంతర్జాతీయ క్రికెటర్ల సంఖ్య 281 మంది అయితే, 838 మంది జాతీయ స్థాయి ఆటగాళ్లు కావడం విశేషం.
విరాట్ రేటు 17 కోట్లు ....
రాయల్ ఛాలెంజ్ బెంగుళూర్ తరపున బరిలోకి దిగే ఇండియన్ డాషింగ్ స్టార్ విరాట్ కోహ్లీ 17 కోట్ల రూపాయల ధరతో ఇప్పటివరకు అత్యధిక ధర పలుకుతున్న ఆటగాడు కావడం విశేషం. విరాట్ తరువాతి స్థానాల్లో మహేంద్ర సింగ్ ధోని 15 కోట్ల రూపాయలు, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 11 కోట్ల రూపాయలతో తులతూగుతున్నారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ కి ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ రూట్ బరిలోకి దిగనున్నాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రనే తిరగరాసిన పొట్టి క్రికెట్ లో ఐపీఎల్ బ్రాండ్ ఇమేజ్ ప్రతి ఏడు పెరుగుతూనే వస్తుంది. సీజన్ సీజన్ కి ప్రకటనల రూపంలో వేలకోట్ల రూపాయలు వసూళ్ళ వర్షం కురుస్తూనే వుంది. ఈసారి హేమా హేమీలు బరిలో నిలబడటంతో వేలం పాట కూడా టి ట్వంటీ లాగే ఆసక్తికరంగా మారింది.
- Tags
- క్రికెటర్లు

