అమరావతి మౌలికవసతులపై చంద్రబాబు దృష్టి

అమరావతి గొప్ప రాజధానిగా ఎదగాలన్నా.. సంకల్పిస్తున్న విధంగా పెద్ద పెద్ద నిర్మణాలకు పెద్దసంస్థలు ముందుకు రావాలన్నా.. కనీసం.. కేంద్రం ఇచ్చే నిధులతో కోర్ కేపిటల్ నిర్మాణాలు చేపట్టాలన్నీ కూడా.. అన్నిటికంటె ముందుగా అమరావతి ప్రాంతంలో ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ కావడం, మౌలికవసతులు కల్పించడం తక్షణావసరం. చంద్రబాబునాయుడు ఇప్పుడు దాని మీదే దృష్టి పెడుతున్నారు. శరవేగంగా మౌలికవసతుల కల్పన పూర్తికావాలని అధికారుల్ని పురమాయిస్తున్నారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే అంతర్జాతీయ సంస్థలతోనూ సంప్రదింపులు జరపాలని ఆయన అధికార్లకు సూచించారు.
బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో అమరావతి నిర్మాణంపై సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాజధాని దేశానికి తలమానికంగా నిలిచేలా మౌలిక వసతులు కల్పించాల్సి వుందన్నారు. ఇందుకోసం పదేళ్లలో సుమారు రూ. 43 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించామని, ఇందులో అధికభాగం వచ్చే నాలుగేళ్లలోనే వినియోగిస్తామని అన్నారు. రహదారుల అనుసంధానం, 24 గంటలు నాణ్యమైన విద్యుత్, మంచినీటి సరఫరా, మెరుగైన మురుగునీటి పారుదల వ్యవస్థ, వ్యర్ధాల నిర్వహణపై ప్రధానంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమరావతిలో అన్ని వసతులు వుంటే పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాస భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు.
మౌలిక వసతుల గణనీయమైన అభివృద్ధిలో భాగంగా రహదారులకు రూ. 4,967 కోట్లు, మంచినీరు-మురుగునీటి పారుదల వ్యవస్థకు రూ. 750 కోట్లు, విద్యుత్ సరఫరాకు రూ. 3,287 కోట్లు, పచ్చదనం పెంపొందించేందుకు రూ. 250 కోట్లు, వరదల నిర్వహణకు రూ. 1,000 కోట్లు, రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులకు రూ. 519 కోట్లు ఖర్చు పెట్టాలని భావిస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నాలుగేళ్లలో చేపట్టే మౌలిక వసతులకు కావాల్సిన రూ. 32,500 కోట్లను తొమ్మిది మార్గాల్లో సమీకరించదలిచినట్టు చెప్పారు. ఇందులో 30 శాతం వరకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. 2018 కల్లా 5 విభాగాలలో మొత్తం 21 ప్రాజెక్టులు ప్రారంభమయ్యేలా ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు.
దేశంలోని టాప్-10 విద్యాసంస్థలను, అంతర్జాతీయ విద్యాసంస్థలను అమరావతిలో నెలకొల్పేలా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులు, పరిశ్రమలు, స్టార్ హోటళ్ల ఏర్పాటుతో అమరావతి సత్వరంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి అన్నారు. 15 ఏళ్లలో అమరావతిని మెగాసిటీగా మలచాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే అన్నిరంగాల్లోనే వృద్ధి చెందేలా చూడాలన్నారు. కోర్ కేపిటల్లో భూములను రాజధానికి తలమానికంగా నిలిచే సంస్థలకే కేటాయించాలని ముఖ్యమంత్రి సూచించారు.
సమీక్ష సమావేశంలో మంత్రి పి. నారాయణ, గుంటూరు ఎంపీ జయదేవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, కేపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీ పార్ధసారధి భాస్కర్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి బి. శ్యాంబాబు, పురపాలక శాఖ కార్యదర్శి అజయ్‌జైన్ పాల్గొన్నారు.

