అనంతలో రాజీ చర్చలు.. కర్నూలులో రావణకాష్టాలు

తెలుగుదేశం పార్టీకి ముఠా కక్షలు, వర్గాల మధ్య తగాదాలు తల బొప్పి కట్టిస్తున్నాయి. ఒక జిల్లాలో రేగుతున్న వివాదాల విషయంలో రాజీ ప్రయత్నాలు చేస్తున్నంత లోపే మరోజిల్లాలో విబేదాలు తెరమీదికి వస్తున్నాయి. వైకాపా నుంచి , ఇతర పార్టీల నుంచి నాయకులు వస్తున్నారు కదాని ఎడాపెడా చేర్చేసుకున్న ఫలితం.. ఇప్పుడు జిల్లాల్లో పార్టీ పరువు తీసేలా ముఠా కక్షలు బయటపడుతుండడంతో నడుస్తోంది.
అనంతపురం జిల్లాలో ఎంపీ జేసీ దివాకర రెడ్డి , ఎంఎల్ఏ ప్రభాకర చౌదరి వర్గాల మధ్య ఉప్పు నిప్పులా ఉన్న సంగతి తెలిసిందే. వీరిని అమరావతికి పిలిపించి చంద్రబాబునాయుడు రాజీకుదిర్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ తగాదాలు సమసిపోయేలా చేయడానికి ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని వేశారు. దీనికి సారధి అయిన మంత్రి నారాయణ గురువారం అనంతపురంలో పర్యటించి.. అక్కడ అసలు వీరి మధ్య వివాదానికి కారణమైన రోడ్ల విస్తరణ, ఆక్రమణల తొలగింపు వ్యవహారాలను గమనిస్తూ వారి మధ్య రాజీ చర్యలను కొనసాగించడానికి ప్రయత్నం చేశారు.
అయితే అటు అనంతలో నారాయణ పర్యటిస్తున్న సమయంలోనే కర్నూలు జిల్లాలోని వర్గాల కక్షలు మరోసారి రచ్చకెక్కాయి. ఇక్కడ శిల్పా మోహన్ రెడ్డి, భూమా నాగిరెడ్డి లకు చెందిన వర్గాల వారు అవకాశం వచ్చినప్పుడెల్లా కొట్టుకుంటూనే ఉన్నారు. ఈ వర్గాల మధ్య గురువారం మరోసారి కొట్లాటలు జరిగాయి. ఈ నేతలను చంద్రబాబు గతంలో అమరావతికి పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది. అయినా పరిస్థితి మాత్రం చక్కబడలేదు.
నియోజకవర్గాల పెంపు కూడా తెలుగు రాష్ట్రాల్లో సాధ్యం కాదని తాజాగా తేలిపోవడంతో.. ముందు ముందు అధికార పార్టీకి వర్గ విభేదాల పోరులు మరిన్ని చోట్ల తల బొప్పి కట్టించే అవకాశం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు.

