అద్భుత అవకాశాలు కోల్పోయిన వైసిపి ...!

రాజకీయ పరిణితి లేకపోతే ఇలానే ఉంటుందని వైసిపి అధినేత జగన్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు విశ్లేషకులు. పార్టీ మారిన ఎమ్యెల్యేలపై చర్యలు తీసుకునే వరకు అసెంబ్లీలోకి అడుగు పెట్టేది లేదంటూ వైసిపి అధినేత జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అంతా తప్పు పడుతున్నారు. ఈ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షానికి ఎన్నో అద్భుత అవకాశాలు అధికార పక్ష టిడిపి పై విరుచుకుపడేందుకు వచ్చాయని అవన్నీ వారి బహిష్కరణతో ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోయాయంటున్నారు. ప్రతిపక్షం లేకుండా సాగే అసెంబ్లీ కొద్ది రోజులు చెప్పగానే నడిచినా చివరిలో వాడిగా వేడిగా సాగింది. అధికారపక్ష ఎమ్యెల్యేలు, బిజెపి పక్ష ఎమ్యెల్యేలు అనేక సందర్భాల్లో మంత్రులను ఇరకాటంలో పెట్టె ప్రశ్నలు సంధించి సభను రక్తి కట్టించారు.
విపక్షం ఉండి ఉంటే ....
ఈ శీతాకాల సమావేశాల్లో కీలకమైన పోలవరం అంశంపై విపక్షం ఉండి ఉంటే అధికారపక్షం నానా ఇబ్బంది పడేది . శాసనసభ ప్రారంభంలోనే కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంపై వైసిపి చెలరేగే అవకాశాన్ని కోల్పోయింది. మరో కీలకమైన అంశం మంజునాథ కమిషన్ కి ఛైర్మెన్ గా వున్న వ్యక్తి తన నివేదిక సమర్పించకుండా ఆ కమిషన్ లో మెజారిటీ సభ్యుల సిఫార్సులు ఆధారంగా రిజర్వేషన్లు ప్రవేశపెట్టి న్యాయపరమైన సంక్లిష్టతను ప్రభుత్వం ఏర్పరిచిన తీరును వైసిపి ఎండగట్టి ఉండేది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతి ఇంకా తేలలేదు. ఎన్నికలు సమీపించే తరుణంలో ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే పరిస్థితి వుంది. ఈ అంశంపై వైసిపి అధికారపక్షాన్ని కడిగేసి ఛాన్స్ మిస్ అయ్యింది. ఇలా అనేక ప్రజా సమస్యలపై అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించే అవకాశాలు వైసిపి కోల్పోవడం పట్ల ఆ పార్టీ సభ్యుల్లో సైతం అసంతృప్తి నెలకొంది. వైసిపి సభలో ఉండి ఉంటే ఇన్నిరోజులపాటు శాసన సభను సైతం సర్కార్ కొనసాగించి వుండి ఉండేది కాదని తద్వారా అధికారపార్టీకి ప్రచారం లభించి ఉండేదే కాదని విశ్లేషకులు అంటున్న మాట.
- Tags
- వైసీపీ

