అఖిలకు రానున్నవి గడ్డురోజులే... ఇది గ్యారంటీ...!

ఆయన భూమా నాగిరెడ్డికి ప్రధాన అనుచరుడు. ప్రియ మిత్రుడు కూడా. మరి ఆయనతోనే బలాబలాలను తేల్చుకునేందుకు సిద్ధమవతున్నారు మంత్రి అఖిలప్రియ. భూమా నాగిరెడ్డి జీవించి ఉన్నంత కాలం ఆయన వెంటనే ఉన్నారు ఏవీ సుబ్బారెడ్డి. ఏవీ సుబ్బారెడ్డికే నంద్యాల బాధ్యతలను నాగిరెడ్డి అప్పగించేవారు. అనుచరుల బాగోగులను చూసుకునే దగ్గరనుంచి అభివృద్ధి పనులన్నీ ఏవీ చేతులమీదుగానే నడిచేవి. ఎవరైనా వచ్చి ఈపని కావాలంటే ఏవీని కలవండని నాగిరెడ్డి చెప్పడం సర్వసాధారణం. అలాంటి ఏవీ సుబ్బారెడ్డి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబానికి క్రమంగా దూరమవుతూ వస్తున్నారు.
ఏవీని దూరం పెడుతూ....
నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి తనకు టిక్కెట్ ఇవ్వాలని ఏవీ కోరారు. అయితే అఖిలప్రియ మాత్రం భూమా కుటుంబంలో ఒకరికి ఇవ్వాలని పట్టుబట్టింది. చంద్రబాబు చేయించిన సర్వేల్లోనూ భూమా కుటుంబానికే మెరుగైన ఫలితాలు రావడంతో శిల్పాను కూడా కాదని భూమా బ్రహ్మానందరెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. అయితే నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనూ ఏవీ సుబ్బారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ వెళ్లింది. ఏవీని పిలిపించి మాట్లాడారు. అఖిలప్రియ ఒంటెత్తు పోకడల కారణంగానే తాను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని బాబు ఎదుట తెగేసి చెప్పారు ఏవీ. అఖిలప్రియ ను పట్టించుకోకుండా ఉప ఎన్నికలో భూమా విజయానికి కృషి చేయాలని చంద్రబాబు కోరడంతో ఏవీ ఆ ఎన్నికల్లో తీవ్రంగానే పనిచేశారు.
డిన్నర్ కు వెళ్లొద్దంటూ....
అయితే ఎన్నికల తర్వాత కూడా అఖిలప్రియ ఏవీని పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు ఈ వివాదం మరింత ముదిరింది. కొత్త ఏడాది వస్తుండటంతో డిసెంబర్ 31వ తేదీన ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో ఒక విందును ఏర్పాటు చేశారు. ఆ విందుకు టీడీపీ పెద్ద స్థాయి నేతల దగ్గర నుంచి కిందిస్థాయి క్యాడర్ వరకూ ఆహ్వానాలందాయి. అయితే తనకు తెలియంకుండా ఆళ్లగడ్డలో ఏవీ ఎలా విందు ఏర్పాటు చేస్తారని ఆగ్రహించి అఖిలప్రియ ఆ డిన్నర్ కు ఎవరూ వెళ్లొద్దని నేతలను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల, ఆళ్లగడ్డ నేతలు హాజరవుతున్నారు. ఈ విషయం తెలిసిన ఏవీ సుబ్బారెడ్డి మరింత పట్టుదలతో స్వయంగా వెళ్లి మరీ నేతలను పిలుస్తున్నారు. అఖిలతో తాడో పేడో తేల్చుకునేందుకు ఏవీ సిద్ధమయినట్లు తెలుస్తోంది. తన బలమేంటో చూపడానికి ఏవీ రెడీ అయిపోయినట్లున్నారు. మొత్తం మీద నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో అఖిలప్రియ తన తండ్రి స్నేహితులను కూడా దూరం చేసుకుంటుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
- Tags
- అఖిలప్రియ

