అంతా కాషాయం చేసేస్తారా?

19 రాష్ట్రాల్లో కాషాయజెండాను ఎగురవేసిన కమలదళం మిగిలిన రాష్ట్రాలపైన కూడా గురిపెట్టింది. ఈ ఏడాది మేఘాలయ, త్రిపుర, నాగాల్యాండ్, మిజోరాం అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. మరో రెండు నెలల్లో మేఘాలయ, త్రిపుర, నాగాల్యాండ్ ఎన్నికలు జరగనుండగా, మిజోరాంలో మాత్రం ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇప్పు ఈశాన్య భారతంలో ఉన్న ఎనిమిది రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాల్లో మూడింట్లో బీజేపీ, రెండింట్లో భాగస్వామ్య పక్షాలతో అధికారంలో ఉంది. ఇక మూడురాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్, వామపక్ష పార్టీలూ అధికారంలో ఉన్నాయి. ఈ మూడింటిని సొంతం చేసుకుంటే ఈశాన్య భారతాన్ని కాషాయమయం చేసినట్లే అవుతుంది.
షా పర్యటన నేటినుంచే....
అందుకోసమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు నుంచే ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈరోజు మేఘాలయలో షా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మేఘాలయలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాదాపు ఎనిమిది మంది పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. వారు నేషనల్ పీపుల్స్ పార్టీలో చేరిపోయారు. మేఘాలయ శాసనసభలో 60 సీట్లున్నాయి. వీటిలో 35 నుంచి 40 స్థానాలను కైవసం చేసుకోవాలన్నది అమిత్ షా వ్యూహంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను ఎండగడుతూ అమిత్ షా ప్రచారం మేఘాలయలో సాగనుంది.
త్రిపుర అంత తేలిక కాదు....
ఇక త్రిపుర సంగతి తీసుకుంటే... ఇక్కడ బీజేపీకి కొంత ఇబ్బందేననిచెప్పవచ్చు. త్రిపురలో ఇప్పుడు వామపక్ష ప్రభుత్వం ఉంది. 1998 నుంచి మాణిక్ సర్కార్ ఇక్కడ వరుసగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మాణిక్ సర్కార్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. దాదాపు ఆరుగురు సీపీఎం ఎమ్మెల్యేలు టీఎంసీలోకి వెళ్లిపోయారు. ఇక్కడ కూడా 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే అప్రతిహతంగా కొనసాగుతున్న మాణిక్ సర్కార్ విజయాన్ని నిలువరించడం అంత సులువుకాదన్నది అమిత్ షాకు కూడా తెలియంది కాదు. త్రిపురలో ఆదివారం అమిత్ షా పర్యటిస్తున్నారు. ఇక మిజోరాంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతుండటంతో అక్కడ కూడా ప్రచారానికి ప్రణాళికను రూపొందించుకున్నారు షా. ఇప్పటివరకూ ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వాలున్నాయి. నాగాల్యాండ్, సిక్కింలలో బీజేపీ మిత్రపక్షాలు పవర్ లో ఉన్నాయి. ఇక ఈ మూడింటిని కైవసం చేసుకోవాలన్నది అమిత్ షా వ్యూహంగా ఉంది. ఈ మూడింటిలంో రెండింటిలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకతతో తాము బయటపడతామని బీజేపీ భావిస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇక ప్రచారాన్ని ముమ్మరం చేశారు కమలదళపతి.
- Tags
- అమిత్ షా

