Sun Dec 08 2024 19:39:47 GMT+0000 (Coordinated Universal Time)
కేటీఆర్కు షర్మిల ఛాలెంజ్
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మంత్రి కేటీఆర్ కు ఛాలెంజ్ విసిరారు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మంత్రి కేటీఆర్ కు ఛాలెంజ్ విసిరారు. మహిళ రిజర్వేన్ల అమలుతో తన సీటు కోల్పోయినా సిద్ధమేనని చెప్పిన కేటీఆర్ బిల్లు అమలయ్యేదాకా ఎందుకు ఇప్పుడే తన సీటు త్యాగం చేయాలని కోరారు. తన సీటును వదులుకుని ఒక మహిళకు ఇస్తే అడ్డుకునేదెవరని షర్మిల ప్రశ్నించారు. మహిళ రిజర్వేషన్లమీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి కామెంట్స్ చేయడం కంటే ముందుగానే సీటును త్యాగం చేయడం మంచిదని షర్మిల కేటీఆర్కు సూచించారు. మహిళ రిజర్వేషన్ బిల్లు మీ పోరాట ఫలితమే అయితే ఈ ఎన్నికల్లోనే మహిళలకు ఎక్కువ స్థానాలను కేటాయించమని మరో సవాల్ కూడా విసిరారు.
దమ్ముంటే ఇప్పుడే...
ఈ ఎన్నికల్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలయ్యేలా చూడమని షర్మిల ఛాలెంజ్ చేశారు. అలా చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు. మహిళలను దారుణంగా అవమానించిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వారి గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతుండటం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. అమరవీరుల కుటుంబాలను పట్టించుకోని మీరు, కనీసం శ్రీకాంతాచారి తల్లి ఓటమి పాలయితే ఆమెకు ఏ పదవీ ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. మీ చెల్లి కవిత ఓడిపోతే మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు మహిళల మీద ప్రేమ లేదని, కేసీఆర్ కుటుంబం మీద మాత్రమేనని అన్నారు. 119 నియోజకవర్గాల్లో 63 స్థానాల్లో మహిళలే ఎక్కువని ఎన్నికల సంఘం చెబుతుందని, దమ్ముంటే ఇప్పుడే మీ సీట్లను త్యాగం చేయాలని షర్మిల సవాల్ విసిరారు. అప్పుడే మీ మాటలను ప్రజలు విశ్వసిస్తారన్నారు.
Next Story