Thu Feb 19 2026 12:29:27 GMT+0530 (India Standard Time)
Telangana : ఆర్టీసీ బస్సుల్లో నకిలీ ప్రయాణం.. అరికట్టడానికి టీజీఎస్ ఆర్టీసీ మరో ప్రయోగం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని అమలు చేసింది

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని అమలు చేసింది. అయితే ఇప్పటి వరకూ గత ఇరవై రెండు నెలలుగా ఈ పథకం దిగ్విజయంగా సాగుతుంది. తొలినాళ్లలో సీట్ల కోసం మహిళలు ఘర్షణ పడటం వంటి ఘటనలు వచ్చినప్పటికీ తర్వాత బస్సుల సంఖ్య పెంచడంతో ఇప్పుడు అది పెద్దగా కనిపించడం లేదు. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా ఉచిత ప్రయాణం తెలంగాణలో చేస్తున్నారని ఆర్టీసీ అధికారులు గుర్తించారు. నకిలీ ఆధార్ కార్డులను తయారు చేసి రాష్ట్రంలో పొరుగు రాష్ట్రాలకు చెందిన మహిళలు ప్రయాణాలు చేయడం గుర్తించిన ఆర్టీసీ అధికారులు దిద్డుబాటు చర్యలకు ఉపక్రమించారు.
ఆధార్ కార్డు తోనే...
మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకూ ఆధార్ కార్డు చూపిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతిస్తున్నారు. ఇది దుర్వినియోగం అయిందని తేలడంతో అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఆర్టీసీ అధికారులు ఆలోచించి స్మార్ట్ కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించారు. స్థానిక మహిళలకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడం ద్వారా ఉచిత ప్రయాణం దుర్వినియోగం చేయడానికి వీలవ్వదని, దానిపై క్యూ ఆర్ కోడ్ కూడా ఉంటుందని, అందువల్ల నకిలీ బాధ ఉండదని తెలంగాణ ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల తెలంగాణకు చెందిన మహిళలు మాత్రమే ప్రయాణం చేసేలా చర్యలను ప్రారంభించింది. ఈ మేరకు స్మార్ట్ కార్డులను తయారు చేయించింది.
మూడు రకాల స్మార్ట్ కార్డులను...
అయితే మూడు రకాల స్మార్ట్ కార్డుల నమూనాలను తెలంగాణ ఆర్టీసీ అధికారులు తయారు చేసి ప్రభుత్వం అనుమతి కోసం పంపినట్లు తెలిసింది. అయితే స్మార్ట్ కార్డులను పంపిణీ చేసిన తర్వాత మాత్రమే దానిని పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటి వరకూ మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ కార్డును అనుమతిస్తారు. ఈ కార్డులు జారీ చేసిన తర్వాత మాత్రమే అమలులోకి తీసుకు వస్తామని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెప్పారు. స్మార్ట్ కార్డుల ఎంపిక ప్రభుత్వం చేసిన వెంటనే వాటి తయారీకి ఇస్తామని, వచ్చిన వెంటనే వాటిని మహిళలకు పంపిణీ చేస్తామని, మూడు నమూనాల్లో ఒకటి ఎంపిక అయిన తర్వాత మార్చి నెల నుంచి స్మార్ట్ కార్డుల పంపిణీకి తెలంగాణ ఆర్టీసీ అధికారులు శ్రీకారం చుట్టనున్నారు.
Next Story

