Sat Dec 07 2024 21:09:54 GMT+0000 (Coordinated Universal Time)
Tiger : మహారాష్ట్ర నుంచే పులులు వస్తున్నాయట.. ఈ కాలంలోనే ఎందుకు దాడి చేస్తాయంటే?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల దాడులు పెరిగాపోయాయి. పొలాల్లోకి ఎవరూ వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల దాడులు పెరిగాపోయాయి. పొలాల్లోకి ఎవరూ వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కుమురంభీం జిల్లాలో అటవీ శాఖ అధికారులు ఆరు బృందాలుగా ఏర్పడి ఈ పులి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అన్వేషణ ఇంకా కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో మనుషులపై దాడి చేయడంపై కూడా అటవీ శాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో కుమరం భీం జిల్లాలో పలు గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. పులిని గుర్తించి దానిని బంధిస్తే తప్ప ప్రజలకు కంటి మీద కునుకు ఉండదని చెబుతున్నారు. మనుషులపై మాత్రమే కాదు పశువులపై కూడా దాడులు చేస్తూ పులి చంపేస్తుంది.
మనుషులపై దాడులకు దిగుతూ...
అయితే ఈ పులులు ఎక్కువగా మహారాష్ట్ర నుంచి వస్తున్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో మనుషులపై దాడులు చేసే పులులను పట్టుకున్న అక్కడి అధికారులు కొంత ఊపిరిపీల్చుకున్నా కొన్ని పులులు మాత్రం మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించాయి. అటవీ ప్రాంతం గుండా అవి ప్రయాణించి ఆదిలాబాద్ కు చేరుకున్నాయి. పొలాల్లో పనులను చేసుకునేందుకు కూడా ప్రజలు జంకుతున్నారు. భయపడిపోతున్నారు. అదే సమయంలో పులి నుంచి తమను కాపాడాలంటూ ప్రజలు అటవీ శాఖ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బితుకుబితుకుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
శీతాకాలంలో తోడు కోసం...
మరోవైపు శీతాకాలంలోనే పులులు ఎక్కువగా దాడులకు దిగుతాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అవి ఈ కాలంలో తోడు కోసం వెదుకుతూ సుదీర్థ దూరం ప్రయాణం చేస్తుంటాయని చెప్పారు. మగ పులి ఆడి పులి కోసం, ఆడపులి మగ పులి కోసం వెదుకులాడుతూ వస్తుందని, ఈ సమయంలో కనిపించిన వారిపై దాడులు చేస్తుంటాయని,మామూలు సమయంలో అవి ప్రమాదకరం కావని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలోనూ ఇదే కాలంలో పులల సంచారం ఎక్కువగా ఉందని, దాడులు కూడా ఎక్కువగా జరిగాయన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అయితే కుమురం భీం జిల్లాలో దాడి చేసిన పులి ఆడదా? మగదా? అన్నది మాత్రం తెలియరాలేదు. మొత్తం మీద పులికోసం వెదుకులాట తీవ్రంగానే కొనసాగుతుంది.
Next Story