Fri Dec 05 2025 11:36:53 GMT+0000 (Coordinated Universal Time)
BJP : బండిపైనే ఈటల తూటాలు.. ఇక యుద్ధం మొదలయినట్లేనా?
మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ కు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మధ్య ఏదో తేడా వచ్చినట్లు కనిపిస్తుంది

మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ కు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మధ్య ఏదో తేడా వచ్చినట్లు కనిపిస్తుంది. ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో నేరుగా బండి సంజయ్ పైనే ఆరోపణలు చేసినట్లు స్పష్టంగా కనపడుతుంది. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా బండి సంజయ్, మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడిగా ఈటల రాజేందర్ 2024 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో గెలిచారు. అయితే ఇద్దరూ బీసీ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో కేంద్రంలో అధికారంలోకి రావడంతో మంత్రి పదవి ఇద్దరూ ఆసక్తి చూపారు. కానీ చివరకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న బండి సంజయ్ కే కేంద్రమంత్రి పదవి లభించింది.
రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలోనూ...
అదేసమయంలో కేంద్ర మంత్రి పదవి రాకపోయినా కనీసం రాష్ట్ర బీజేపీ అధ్యక్ష్య పదవి వస్తుందేమోనని ఈటల రాజేందర్ చూశారు. 2023 ఎన్నికలకు ముందు బీజేపీలో ఈటల రాజేందర్ చేరారు. అయితే ఆయన నక్సల్ ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమంలోకి తర్వాత బీఆర్ఎస్ లోకి అనంతరం బీజేపీలోకి వచ్చారు. బీజేపీ సిద్ధాంతాలకు, ఈటల గతానికి సంబంధమే లేదు. అందుకే ఈటల రాజేందర్ కు పదవి లభించలేదన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి రాకపోవడానికి బండి సంజయ్ ప్రధాన కారణమని ఈటల రాజేందర్ నమ్ముతున్నారు. అంతేకాకుండా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల అనుచరులకు కూడా పదవులు అందకుండా బండి సంజయ్ చేస్తున్నారని ఈటల రాజేందర్ అనుమానిస్తున్నారు. పార్టీలో ఎలాంటి గ్రూపులకు అవకాశం ఉండదన్న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈటల వర్గానికి సూటిగా తాకాయి.
ఈటల స్ట్రయిట్ వార్నింగ్...
రెండు రోజుల క్రితం ఈటల ప్రధాన అనుచరుడు, హుజూరాబాద్ బీజేపీ నేత రాజీనామా చేయడం వెనక ఈటల హస్తం ఉందని కూడా తెలిసింది. అందుకే ఈటల ఈరోజు నేరుగా బండి సంజయ్ పేరును ప్రస్తావించకపోయినా ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు అర్థమవుతుంది. హైదరాబాద్ లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలతో ఈటల రాజేందర్ మాట్లాడారు. తనపై కుట్ర జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కోవర్టుల వల్లే ఇది జరుగుతుందని, దీనిపై తాను హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పారు. అంతేకాదు. తాను బీజేపీలోకి వచ్చిన తర్వాతనే మొన్న జరిగిన పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల్లో యాభై వేల మెజారిటీ బీజేపీకి వచ్చిందని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. తాను వచ్చిన తర్వాతన... తాను రాకముందు ఎంత మెజారిటీ వచ్చిందో తెలుసుకోవాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో సర్పంచ్ లకు బీఫారాలు అవసరం లేదని, మనోళ్లను పోటీకి నిలబెడదామని ఈటల రాజేందర్ అనడంతో ఇక వార్ వీధుల్లోకి వచ్చినట్లయిందన్న కామెంట్స్ వినపడుతన్నాయి.
Next Story

