Fri Dec 05 2025 21:52:39 GMT+0000 (Coordinated Universal Time)
TDP : నేతలను చంద్రబాబు క్రమంగా దూరం పెడుతున్నారా? ఇక వదిలించుకోవడానికేనా?
తెలంగాణలో రానున్న జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీపై ఇంకా సందిగ్దత నెలకొని ఉంది.

తెలంగాణలో రానున్న జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీపై ఇంకా సందిగ్దత నెలకొని ఉంది. రాజకీయంగా తెలంగాణ టీడీపీ పోటీపై ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఏడాది క్రితం వరకూ ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పోటీకి దూరంగా ఉండే అవకాశముందని కూడా చెబుతున్నారు. ఏడాది క్రితం అంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోనూ టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పారు. ఉన్నకమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత మాత్రం ఇక తెలంగాణ టీడీపీనిమాత్రం పట్టించుకోవడం లేదు.
నేతలకూ దూరంగా...
శని, ఆదివారాలు హైదరాబాద్ కు చంద్రబాబు నాయుడు వస్తున్నప్పటీకీ తన ఇంట్లోనే కొందరు నేతలను కలవడం మినహా చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రాలేదు. అంటే నాడు జరిగిన సమావేశంలో తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అలాగే హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా వచ్చే ఏడాది జరగనున్నాయి. అందులోనూ పోటీ చేయాలని భావించారు. కానీ ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలను మాత్రం నిర్వహించడం లేదు. అసలు తెలంగాణలో పార్టీ ఉందా? లేదా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే తెలంగాణ టీడీపీ నేతలు కూడా ఏ రకంగా, ఏ సమస్యపైన కూడా స్పందించడం లేదు.
జమిలి ఎన్నికలు జరిగితే...
అయితే వచ్చే ఎన్నికల్లో కూటమిగా ఏర్పాటయి పోటీ చేయాలని జరుగుతున్న ప్రచారంలో కూడా వాస్తవం లేదంటున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తెలంగాణలో మాత్రం ఒంటరిగానే పోటీ చేయడం మంచిదని చెబుతున్నారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే పార్టీకి నష్టమని, బీఆర్ఎస్ మళ్లీ ఆంధ్రా సెంటిమెంట్ ను తీసుకు వచ్చి లబ్ది పొందే అవకాశముందని చెబుతున్నారు. అందుకే ఇక్కడ కూటమి ఏర్పాటు సాధ్యం కాదు. మరొక వైపు రానున్న ఎన్నికలు జమిలి ఎన్నికలయితే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. చంద్రబాబుకు ఆంధ్ర్రప్రదేశ్ లో ఎన్నికలు ముఖ్యం కాబట్టి తెలంగాణ ఎన్నికలకు ఆయన దూరంగా ఉండే అవకాశముంది. అందుకే తెలంగాణ టీడీపీ నేతలకు కూడా ఆయన దూరం పాటిస్తున్నట్లు తెలుస్తుంది.
Next Story

