Fri Dec 05 2025 13:38:39 GMT+0000 (Coordinated Universal Time)
BRS : రాజకీయాల్లో... రక్త సంబంధం అంతా ట్రాష్.. అన్నా లేదు.. చెల్లి లేదు.. ఏక్ నిరంజన్
బీఆర్ఎస్ లో కల్వకుంట్ల కవిత కాక మామూలుగా లేదు

బీఆర్ఎస్ లో కల్వకుంట్ల కవిత కాక మామూలుగా లేదు. నిజమే రక్త సంబంధం.. ఆప్యాయతలు.. రాఖీ పండగలు.. ఇవన్నీ ట్రాష్. రాజకీయాలలో పదవులు, అధికారం, ఆధిపత్యమే ముఖ్యం. తెలుగు రాష్ట్రాల్లో ఇది మరోసారి రుజువయింది. అధికారంలో ఉన్ననాళ్లు కలసి మెలిసి ఉన్నట్లు లేనిపోని ప్రేమలు పంచుకున్న వారే అధికారం కోల్పోయిన తర్వాత పగ పెంచుకుంటున్నారు. మరి తేడా ఆస్తుల వల్ల వచ్చిందా? లేదా పార్టీలో తమకు కూడా పార్ట్ నర్ షిప్ ఇవ్వాలని కోరుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందన్నది తెలియదు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది సర్వసాధారణమయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు విడిపోయిన తర్వాత జరుగుతున్న ఈ పరిణామాలు రెండు పెద్ద కుటుంబాలను నడిరోడ్డు మీదకు నెట్టేశాయి. అక్కడా .. ఇక్కాడా సేమ్ పాలిటిక్స్.. కాకుంటే క్యారెక్టర్ యాక్టర్లు వేరు. పొలిటికల్ సీన్ మాత్రం సేమ్ టు సేమ్.
ఇద్దరు నేతలు పోరాడి...
ఇద్దరు నేతలు.. ఒకరు కొన్ని దశాబ్దాల పాటు పోరాడి.. చివరకు పార్టీని అధికారంలోకి తెచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం. అదే సమయంలో తెలంగాణ కోసం దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించి తెచ్చిన కేసీఆర్ కుటుంబం. ఇద్దరు నేతలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. వారి పోరాటం అందరికీ స్ఫూర్తి. ఎందుకంటే అసమాన్యమైన ఘనతను సాధించి చరిత్ర సృష్టించారు. అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాజకీయంగా ఇబ్బందుల పడుతున్న వేళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదేళ్ల పాటు కాంగ్రెస్ ను అధికారంలోకి తేగలిగారు. ఇక రాదు రాదు అనుకుంటున్న తెలంగాణ ను తెచ్చిన కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ను దాదాపు పదేళ్ల పాటు అధికారంలో ఉంచారు.
ప్రాధాన్యత ఇవ్వలేదని షర్మిల...
2014లో వైసీపీ అధికారంలోకి రాకపోయినా అన్నా చెల్లెళ్లయిన జగన్, షర్మిల మధ్య విభేదాలు తలెత్తలేదు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు షర్మిల పార్టీ వ్యవహారాలను చూసుకోవడమే కాకుండా పాదయాత్ర కూడా చేశారు. 2019 ఎన్నికలలో అధికారం వచ్చిన తర్వాత మొదలయిన అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలు2024 లో ఓటమి తర్వాత విడిపోయే పరిస్థితికి తలెత్తాయి. జగన్, వైఎస్ షర్మిల మధ్య రాజకీయ వైరుధ్యమే కాదు. ఆస్తి తగాదాలు కూడా తోడవ్వడంతో ఇద్దరూ ఉప్పు నిప్పూలా తయారయ్యారు. ఇద్దరి దారులు వేరు అయ్యాయి. తండ్రి వైఎస్ మరణం తర్వాత తల్లి విజయమ్మ ఎటూ తేల్చుకోలేని స్థితిలో చివరకు కూతురు పంచన చేరిపోయారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అన్నాచెల్లెళ్లయిన వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉంటూ అధికారం కోస ప్రయత్నిస్తున్నారు. జగన్ ను ఓడించడమే లక్ష్యంగా గత ఎన్నికల్లో షర్మిల పనిచేశారంటే ఇక వారు కలవడం అనేది కుదరదన్నది స్పష్టమయింది.
కవిత వేరు కుంపటి ఖాయమైనట్లేనా?
ఇక తాజాగా తెలంగాణలోనూ 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటంతో పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు. కేటీఆర్ రాష్ట్ర మంత్రిగా, కవిత నాడు ఎంపీగా ఢిల్లీ రాజకీయాలకు పరిమితమయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో కవిత ఎంపీగా ఓడిపోవడంతో పాటు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో అన్నా చెల్లెళ్ల మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. కవిత నేరుగా కేటీఆర్ ను విమర్శిస్తూ మాట్లాడుతున్నారంటే ఆమె టార్గెట్ అన్న అని అర్థమవుతుంది. అన్న తనను తండ్రికి దూరం చేస్తున్నారని, పార్టీలో తనకు, తన వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి సోదరుడు కేటీఆర్ కారణమని నమ్ముతున్నారు. అందుకే ఆమె బరస్ట్ అవుతున్నారు. ఇక వీరిద్దరూ కలసి నడిచేది కాదన్నది నేడు కవిత చేసిన వ్యాఖ్యలతో అర్థమయింది. కేసీఆర్ కళ్ల ముందే కూతురు, కొడుకు కొట్లాట ఆయనకు మాత్రం తలనొప్పిగా తయారయిందనే చెప్పాలి. మొత్తం మీద అన్నా చెల్లెళ్ల ఆధిపత్య పోరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం హాట్ టాపిక్ గా మారింది.
Next Story

